జాతీయ రహదారిపై వెళుతున్న ఓ వ్యాన్‌ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పిన బస్సు వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 15 మంది మృతిచెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో 93వ జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ప్రమాదానికి గురైన వ్యాన్‌లో ప్రయాణిస్తున్నవారు హాథ్రస్ నుంచి ఆగ్రా వైపు వెళుతున్నట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో వ్యానులో ప్రయాణిస్తున్న వారిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో నలుగురు మహిళలు, మరో నలుగురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు. క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని సూచించారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలు చేపట్టి బాధితుకు తగిన సాయం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతులకు రూ.2లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ.