జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తిరుపతి వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే తిరుపతి నుంచి తనపై పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. ఈ సవాల్‌ను పవన్ కల్యాణ్ స్వీకరిస్తారా, లేదా అనేది వేచి చూడాలి. తిరుపతి సీటును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేనకు కేటాయించారు. దీంతో పవన్ కల్యాణ్ పోటీ చేయడానికి అవకాశం చిక్కింది.
మాజీ ఎమ్యెల్యే సుగుణమ్మ, నర్సింహ యాదవ్ తిరుపతి నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆ ఇద్దరిని చంద్రబాబు పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది. జనసేన అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని, తాము అధికారంలోకి వస్తే సముచిత స్థానాలు కల్పిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కిరణ్ రాయల్, పసుపులేటి సుధాకర్ వంటి బలిజ నాయకులు తిరుపతి జనసేన టికెట్ ఆశిస్తున్నారు. బలిజ సామాజిక వర్గం తిరుపతి నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. దీంతో జనసేన విజయం సాధిస్తుందనే విశ్వాసంతో వారున్నారు. పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది
పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయాలని, ఆయన పోటీ చేస్తే ఓడించి పంపుతామని అభినయ్ రెడ్డి అన్నారు. గతంలో పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి అభినయ్ రెడ్డి తండ్రి భూమన కరుణాకర్ రెడ్డిని ఓడించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేసి అభినయ్ రెడ్డిని ఓడిస్తారా లేదా అన్నది చూడాలి.