వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ రావడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓ ట్వీట్ వేశారు. అయితే ఆ ట్వీట్ తో ఆయన జగన్ ని డిఫెన్స్ లో పడేసినట్టయింది. జగన్ ని పొగిడే క్రమంలో అంబటి, సర్వోన్నత న్యాయస్థం తీర్పు పరిధిలోకి వెళ్లినట్టు అర్థమవుతోంది. అదే సమయంలో ఇదే కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేష్ వ్యవహారాన్ని పరోక్షంగా హైలైట్ చేసినట్టయింది.
ఇంతకీ అంబటి ఏమన్నారు..?
“టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముద్దాయిలకు
సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు!
ఎంత దూరం అయినా వెళ్లి కార్యకర్తలను
రక్షించుకుంటాడు మన జగనన్న !”
ఇదీ అంబటి వేసిన ట్వీట్.. ఇక్కడ జగనన్న కార్యకర్తల్ని రక్షించుకోడానికి ప్రత్యేకంగా చేసిన ప్రయత్నం ఏంటి..? టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముద్దాయిలుగా ఉన్న నేతలు నేరుగా సుప్రీం కోర్టుకి వెళ్లారు, బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ విషయంలో జగన్ కృషి ఏముంది..? జగన్ కృషి చేస్తే కోర్టులు కరిగిపోయి బెయిలిచ్చేస్తాయా..? జగన్ ని పొగిడే క్రమంలో బెయిల్ రావడాన్ని కూడా ఆయన క్రెడిట్ గా చెప్పుకొచ్చారు అంబటి. బెయిల్ రావడానికి ప్రధాన కారణం జగన్ అన్నట్టుగా ట్వీట్ వేశారు.
https://x.com/AmbatiRambabu/status/1834491350202388669
పోనీ జగనన్న కార్యకర్తలకోసం ఎంత దూరమైనా వెళ్తారనుకుందాం. అలా వెళ్లగలిగినప్పుడ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎందుకు అరెస్ట్ అయ్యారు. ఎందుకు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. అన్యాయంగా దళిత నేతను అరెస్ట్ చేశారంటూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆరోపణలు కూడా చేశారు. మరి దళిత నేతను కాపాడుకునే క్రమంలో జగన్ చేసిన ప్రయత్నమేంటి..? దళిత నేతకు బెయిల్ రాలేదు, మిగతావారికి మాత్రమే బెయిలొచ్చిందనే విషయాన్ని అంబటి తన ట్వీట్ ద్వారా మరోసారి గుర్తు చేసినట్టయింది.
ఏపీ రాజకీయాల్లో కూడా ట్విట్టర్ వీరులు చాలామందే ఉన్నారు. అనవసరంగా ప్రెస్ మీట్ ఎందుకు అనుకున్నప్పుడు ట్విట్టర్లో తమ వ్యాఖ్యానాలను పోస్ట్ చేస్తుంటారు. సూటిగా స్పష్టంగా చెప్పడానికి బదులు, అప్పుడప్పుడు కవితాత్మకంగా చెబుతుంటారు. సుప్రీంకోర్ట్ బెయిల్ వ్యవహారాన్ని కూడా జగన్ సాధించిన క్రెడిట్ లాగా చెప్పాలనుకున్నారు అంబటి. ఈ ట్వీట్ కి దారుణమైన కామెంట్లు పడుతున్నాయి.