రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అనకాపల్లి పార్లమెంటు సీటును మాత్రం పెండింగ్‌లో పెట్టారు. వ్యూహాత్మకంగానే ఆయన సీటును పెండింగ్‌లో పెట్టినట్లు అర్థమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాతనే జగన్ తన పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున సిఎం రమేష్‌ను బరిలోకి దించే ఆలోచన జరుగుతున్నట్లు సమాచారం. అయితే, సిఎం రమేష్ విశాఖపట్నం సీటును ఆశిస్తున్నారు. విశాఖ సీటు ఇచ్చేది లేదని బీజేపీ నాయకత్వం ఆయనకు తెగేసి చెప్పినట్లు సమాచారం.
అనకాపల్లి సీటు కోసం వైఎస్ జగన్ కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదారి ఆనంద్ సోదరి పీల రమాదేవి, మంత్రి గుడివాడ అమర్నాథ్ సన్నిహిత అనుచరుడు బొద్దెడ ప్రసాద్, బొద్దేటి కాశి విశ్వనాథ్ పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని అభ్యర్థిని కూడా అనకాపల్లిలో ఆయన రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు.