ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నిత్యం బురద చల్లుతున్నారు. క్రాస్ చెక్ కూడా చేసుకోకుండా అబద్ధాలతో పత్రికను నింపేస్తున్నారు. సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రూ.370 కోట్లు రుణం తీసుకుందని తప్పుడు వార్తను ఆ పత్రిక ప్రచురించింది. ఆ కథనాన్నిహెచ్‌డీఎఫ్‌సీ ఖండించింది. ఆ వార్త అవాస్తవమని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని సోమవారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది.
జగన్‌ను ఓడించి చంద్రబాబును అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి రాధాకృష్ణ రాష్ట్రం పరువు ప్రతిష్టలను కూడా దెబ్బ తీయడానికి వెనుకాడడం లేదు. ఇందులో భాగంగానే సచివాలయం తాకట్టు అంటూ విష ప్రచారానికి తెరతీశారు. ఆ వార్తా కథనాన్ని ప్రచురించడం, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారంలోకి తేవడం, దాన్ని ఆసరా చేసుకుని టీడీపీ వర్గాలు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేయడం… ఒక వ్యూహం ప్రకారం జరుగుతోంది.
విష ప్రచారం ద్వారానే వైఎస్ జగన్‌ను గద్దె దించాలనే కుట్రలు కొనసాగుతున్నాయి. జగన్‌ను నేరుగా ఎదుర్కోవడం చేతకాక ఆ విధంగా అబద్ధాలను ప్రచారంలోకి తెస్తున్నారు.