గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ రంగం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగాలు లభించగా, మరింత మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఎలక్ట్రానిక్ రంగంలో బ్లూస్టార్, డైకిన్, పానాసోనిక్, డిక్సన్, హావెల్స్, సన్నీ ఆప్‌టెక్ వంటి 24 దిగ్గజ కంపెనీలు రూ.10,705 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దానివల్ల 36,205 మందికి ఉద్యోగాలు లభించాయి.
అంతేకాకుండా విశాఖపట్నం జిఐఎస్‌లో రూ.15,711 కోట్ల విలువైన మరో 23 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 55,140 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. బ్లూస్టార్, డైకిన్స్, హావెల్స్ వంటి ఏసీ తయారీ యూనిట్ల ఏర్పాటుతో దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఏసీల్లో ఒకటి మేకిన్ ఆంధ్రానే అనిపించుకుంది.
కొప్పర్తిలో ఈఎంసీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరిన్ని అవకాశాలు ఏర్పడుతాయి. తిరుపతి జిల్లా శ్రీసిటీలో జపాన్ ఏసీ తయారీ సంస్థ డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ వంటి సంస్థలు భారీగా యూనిట్లను ఏర్పాటు చేశాయి.
వాటిలో డైకిన్ ఒక్కటే తొలి దశలో ఏటా 10 లక్షల యూనిట్లను తయారు చేస్తోంది. అంతేకాకుండా రెండో దశలో మరో 15 లక్షలు తయారు చేసేవిధంగా విస్తరణ చేపట్టింది. ఇందుకు వేయి కోట్ల రూపాయల పెట్టుబడులను జపాన్ సంస్థ పెట్టింది. అదే విధంగా బ్లూస్టార్ ఏటా 12 లక్షల యూనిట్లను తయారు చేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.
ప్రస్తుతం ఏటా దేశవ్యాప్తంగా 75 లక్షల గృహ వినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పది వేల మందికి ఉపాధి కల్పిస్తోంది,
కొప్పర్తిలో రూ.749 కోట్లతో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)ని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రూ.8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 28,250 మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే డిక్సన్ వంటి సంస్థలు కొప్పర్తిలో ఉత్పత్తిని ప్రారంభించాయి.