గవర్నమెంట్ అంటే ఇదా..! ఇలాగేనా పరిపాలించడం. జగన్మోహన్‌రెడ్డికి మతిగాని పోయిందా.. గురువా..? అదేంట్రా శిష్యా.. అంతమాట అనేశావ్..?
కాకపోతే మరేంటి చెప్పు.. పేదవాళ్లని ఎనకేసుకొస్తున్నాడు. వాళ్లకి ఏకంగా వేలకు వేలు పంపిస్తున్నాడు. దిక్కులేని పేదోళ్లని ఆదుకోడానికేనా గవర్నమెంట్ ఉన్నది..!
అదేంట్రా, ప్రజల ప్రభుత్వం అన్నప్పుడు వాళ్ల కోసం పనిచేస్తే తప్పేంటి..?
తప్పా, తప్పున్నరా..? పైకి అందరూ ప్రజల కోసమే అంటారు గానీ, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, పరిశ్రమలు పెట్టే కోటీశ్వరుల కోసమేగా పనిచేసేది..!
వ్యాపారాలూ, పరిశ్రమలూ ఉండవని కాదుగా సామాన్య జనం సంతోషంగా ఉండటం ముఖ్యం కాదంటావా శిష్యా..?
అదేం పద్ధతి గురువా, మాలమాదిగలకీ, బీసీగాళ్లకీ ఇంగ్లీషు చదువులెందుకు చెప్పు..! వాళ్లు కలెక్టర్లూ, అధికారులూ అయ్యి మన నెత్తిన ఎక్కి పెత్తనం చెయ్యడానికా..?
అవేం మాటలురా.. పిల్లల మధ్య కూడా తేడాలు ఉంటాయా..? ఎవరి బిడ్డలైనా బిడ్డలే కదా.. మంచి చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేసుకోవద్దా. అభివృద్ధి అంటే అదికాదా..?
నువ్వెన్నన్నా చెప్పు. కూటికి గతిలేని నా కొడుకులకి అంతంత చదువులెందుకు..? అడుక్కుతినే వాళ్ల కొడుకుల్ని కూడా అమెరికా పంపిస్తారా ఏంటి..?
ఏం మాట్లాడుతున్నావ్‌రా..? ఇప్పుడు ఊళ్లలో, చిన్నా పెద్దా గ్రామాల్లో ఏ ఆధారం లేని ఆడవాళ్లకి మూడేసి వేల రూపాయలు పంపిస్తున్నారు. అదీ తప్పేనంటావా..?
కాదా మరి. పొలాల్లోనో, ఇళ్లల్లోనో పనులు చేసుకుని బతికేవాళ్లకి వేలకు వేలు పంపిస్తారా ఎవరన్నా..!
అలా అయితే పేద ముస్లింలకూ, క్రిస్టియన్లకూ డబ్బు సాయం చెయ్యడమూ తగని పనేనా..!
అంతే మరి, అవన్నీ పిచ్చిపనులు, అభివృద్ధి కదా ముఖ్యం. అమరావతి కదా అత్యవసరం, ఇలా కాణీకి ఠికాణాలేని వాళ్లని పెంచి పోషిస్తే ఏమౌతుంది..?
మరయితే, అన్ని సౌకర్యాలతో ఆస్పత్రులు పెట్టడం, పేదవాడి ఆరోగ్యం కోసం తాపత్రయ పడడం కూడా కానిపనేనా..?
ఖచ్చితంగా అంతే, అన్నీ ఉచితంగా అమర్చిపెడితే అందరూ సోమరిపోతులు అవుతారు చివరికి..!
ఇదేమి లాజిక్కు శిష్యా.. స్కూళ్లు బాగున్నాయి. పిల్లల చదువులు బాగున్నాయి. ఆస్పత్రుల్లో పేద జనానికి చక్కని వైద్యం దొరుకుతోంది. జనం సంతోషంగా ఉండడం కూడా నేరమే అంటావా..?
ఎన్నికల్లో గెలిచేద్దామని ఇలాంటి అడ్డగోలు పనులన్నీ చేస్తే సరిపోతుందా..? అభివృద్ధిని పాతిపెట్టి, రాష్ట్రాన్ని తగలబెట్టి జగన్ ఏం సాధిద్ధాం అనుకుంటున్నాడు..? పేదోళ్లకి తియ్యటి గాలి కబుర్లు చెప్పాలి. పెద్దోళ్లకీ బాగా బలిసినోళ్లకీ సాయం చెయ్యాలి, ఇదీ కదా రాజకీయం అంటే ఆ మాత్రం తెలీదా రాజశేఖరరెడ్డి కొడుక్కి..?
జగన్ కుర్రాడురా.. ఆవేశపరుడు. గెలిపించిన జనానికి రుణపడి ఉన్నాననీ, అది తీర్చుకోవాలనీ తాపత్రయపడుతున్నాడు. నువ్వేమో తిడుతున్నావు. కొంపదీసి నువ్వు చంద్రబాబు మనిషివా ఏంటి..?
నువ్వేమన్నా అనుకోగురూ.. చంద్రబాబుకి రాజకీయం బాగా తెలుసు. ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏ పనీ చేయలేదు. కబుర్లతోనే కడుపునింపాడు. ఇప్పుడు కూడా, వింటున్నాంగా.. ఆడాళ్లకి బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత కరెంటు, తక్కువ రేటుకి గ్యాస్ సిలిండర్లు అని మాటలు కోటలు దాటిస్తున్నాడు. అది కదా తెలివంటే, అధికారం ఉన్నన్నాళ్లూ, కొవ్వెక్కి కొట్టుకునే కాంట్రాక్టర్లకీ, పెద్ద వ్యాపారస్తులకీ, సొంత కులం మనుషులకీ వందల వేల కోట్లు దోచిపెట్టాడు. పేదవాడి మొహం కూడా చూడలేదు. అందుకేగా జనం బాబుని దించేసి, జగన్‌ని గెలిపించుకున్నది..!
అంటే, నువ్వంటున్నది ప్రజలకి మేలు చేసేవాడు ముఖ్యమంత్రిగా ఉండాలనేగా..
అబ్బే, నా పాయింట్ నీకు ఎక్కలేదు గురువా..! పేదోడే నా ప్రాణం, వాళ్ల కోసం ఏమైనా చేస్తాను, రైతుల్ని రక్షిస్తాను, ఆడవాళ్లని ఆదుకుంటాను అని గట్టిగా అరిచి చెప్పాలి. గప్‌చిప్‌గా మన వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ పనులూ చేసుకోవాలి. వేల కోట్లు నొక్కేసి అలగా జనానికి చిల్లర పైసలు విసిరెయ్యాలి. ఇలాంటి రాజకీయం చేసినోడికే ఇవి రోజులు. జనం కోసం పగలూరేత్రి ఆలోచించి, వాళ్లకి మంచి చేసేవోడు విలన్‌గా మిగిలిపోతాడు.
అయితే రేపు జగన్మోహన్‌రెడ్డి గెలుపు కష్టమేనంటావా..?
అదేమో, నాకేం తెల్సుగానీ, గత ఎన్నికల్లో లాగా ఈసారీ ప్రజలు గెలుస్తారు. ప్రచారం చేసే పత్రికలకీ, టీవీలకీ నిజం తెల్సినా చెప్పరు. జనానికి వాస్తవాలు తెలుసు, తమని ఎవరు ఆదుకుంటున్నారో తెలుసు, తమ భవిష్యత్‌కి భరోసా ఎవరో కూడా వాళ్లకి స్పష్టంగా తెలుసు..
అయినా, తొందరేముంది. ఒక్క రెండు నెలలు ఆగు..!