విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ఎటు చూసినా ప్రజల దయనీయ పరిస్థితులే కళ్లకు కడుతున్నాయి. వరద ముంచుకొచ్చి మూడు రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సాయం కొద్దిమందికే అందుతోంది. సహాయ కార్యక్రమాలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది సుస్పష్టం. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే ఒక దశలో అంగీకరించినా.. అందుకు అనుగుణంగా సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయడంలో మాత్రం ఎలాంటి చర్యలూ కనిపించడం లేదు. ఒకపక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోట్లు అరకొరగానే ఉండటం.. అవి కూడా సహాయం కోసం దీనంగా చూస్తున్న ప్రజలను పట్టించుకోకుండా వెళ్లిపోతుండటం.. కనీస అవసరాలైన నీళ్లు, ఆహారం కోసం పీకల్లోతు వరద నీటిలో ప్రజలు తాళ్లు పట్టుకుని మరీ నడుచుకుంటూ వెళుతున్న తీరు అక్కడి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ముంపు బారిన పడి, గుండె పోటుకు గురై.. ఇలా పలు కారణాలతో చనిపోయినవారి భౌతిక కాయాలను తరలించేందుకు కూడా సహాయం అందని దారుణ పరిస్థితులు. చంటిపిల్లలకు పాలు కూడా దొరకని దయనీయ స్థితి. కలలో కూడా ఊహించని ఉపద్రవాన్ని విజయవాడ నగర వాసులు కళ్లారా చూస్తూ ఈ విపత్తు నుంచి బయటపడేదెలా అనుకుంటూ బిక్కుబిక్కుమంటున్న హృదయవిదారక దృశ్యాలే అన్ని చోట్లా కనిపిస్తున్నాయి.
బాధితులు 5 లక్షల మంది.. బోట్లు 200..
విజయవాడ వరద ముంపు బాధితులు సుమారు 5 లక్షల మంది ఉండగా.. వారి సహాయార్థం ప్రభుత్వం ఏర్పాటుచేసిన బోట్లు 200 కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అంతమంది బాధితులకు ఏమేరకు సాయం అందుతుందనేది అర్థం చేసుకోవచ్చు. సింగ్‌నగర్, పాయకాపురం, రాజీవ్‌నగర్, ఇందిరానాయక్ నగర్, కండ్రిగ, పైపుల రోడ్డు, పాత రాజరాజేశ్వరిపేట, న్యూ రాజరాజేశ్వరిపేట, మధ్య కట్ట, అయోధ్యనగర్, వాంబే కాలనీ, దేవీ నగర్, జక్కంపూడి కాలనీ, భవానీపురం, విద్యాధరపురం, గొల్లపూడి తదితర అనేక ప్రాంతాలు నీటమునగడంతో ఆయా ప్రాంతాల ప్రజలు కనీస అవసరాలు కూడా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఓ పక్క తాగునీరు కూడా లేక, మరోపక్క ఆహారం అందక జనం ఆకలితో అలమటించిపోతున్నారు.
తమ స్నేహితులు, బంధువుల, పరిచయం ఉన్నవారికి ఫోన్లు చేసి సహాయం కోసం అర్థిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కూడా లేక అంధకారం అలుముకోవడంతో ఫోన్లకు చార్జింగ్ పెట్టే అవకాశం కూడా లేక బయటి వారికి ఫోన్ చేసేందుకు వీలులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు, బాలింతలు, అత్యవసర మందులు అవసరమైనవారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆదుకునేవారే లేక అల్లాడిపోతున్నారు.
నరకంలోనూ వ్యాపారమే..
వరద ముంపులో చిక్కుకుని ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తుంటే.. వారిని ఆదుకోవాల్సి ఉండగా.. వారి అవసరాలను క్యాష్ చేసుకునేందుకు మరికొందరు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఒక టిన్ మంచినీళ్లు రూ.500కి విక్రయిస్తున్నారు. ఒక కేజీ బియ్యం రూ.300కి అమ్ముతున్నారు. ఒక కిలోమీటరు దూరం బోటులో తీసుకెళ్లమని సాయమడిగితే రూ.3 వేలు ఇస్తేనే తీసుకెళతామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోట్లలో ఉన్నవారే డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రైవేటు బోట్లలో ఉన్నవారి తీరు మరీ దారుణం. ఆహార పొట్లాలను అందించే ప్రయత్నంలో కొంతమందికే అందుతుండటం, మిగిలినవారు ఆహారం అందక ఆందోళనకు గురవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. హెలికాప్టర్లు తెప్పించామని చెబుతున్నా వాటి వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని అధికారులే పెదవి విరుస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులను ప్రశ్నించగా, మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో బాధితుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.