హిందూపురం నియోజకవర్గంలో గత రెండు ఎన్నికలలో చంద్రబాబు బావమరిది సినీ నటుడు బాలకృష్ణ విజయకేతనం ఎగరేస్తున్న సంగతి మనకు తెలిసిందే. 2014, 2019లోనూ హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా ఆయన హిందూపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు.
ఈసారి కూడా తనకు హిందూపురంలో ఎదురులేదని బాలయ్య ఎంతో ధీమాగా ఉన్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణకు ఊహించని విధంగా షాక్ తగిలింది. హిందూపురంలో టీడీపీ తరఫున కీలకంగా వ్యవహరిస్తున్న నిమ్మల కిష్టప్ప ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకొనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో కొందరు వైసీపీ నేతలు చర్చలు కూడా జరిపారని సమాచారం.
నిమ్మల కిష్టప్ప గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఈయనను పార్టీ పట్టించుకోవడంలేదు. ఈ ఎన్నికల్లో పుట్టపర్తి టికెట్ వస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూర రెడ్డి ఎన్నికల పోటీలోకి దిగారు.
హిందూపురం ఎంపీగా అయిన అవకాశం వస్తుందని ఎదురుచూసిన నిమ్మల కిష్టప్పకు నిరాశే మిగిలింది. హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని బీకే పార్థసారథి తన్నుకుపోయారు. దీంతో ఎంతో రాజకీయ అనుభవం ఉన్న తనకు ఇది పెద్ద అవమానకరంగా భావించిన నిమ్మల కిష్టప్ప ఏకంగా వైసీపీ చెంతకు చేరటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. వైసీపీ తరఫున దీపిక పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమె బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి కావటం విశేషం. ఇక నిమ్మల కిష్టప్ప కూడా బీసీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఈయన వైసీపీలోకి వస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని స్పష్టంగా తెలుస్తోంది.