వైసీపీకి మరో బిగ్ షాక్ తగలబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి, జగన్‌కు దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాలినేనితో పార్టీ చీఫ్ జగన్ మాట్లాడినప్పటికీ.. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేదట. ఈ నేపథ్యంలోనే వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు బాలినేని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.
2012లో కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు బాలినేని. తర్వాత ఒంగోలులో జరిగిన బైఎలక్షన్‌లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం తొలి రెండున్నరేళ్లు మంత్రిగానూ పనిచేశారు. తర్వాత మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తర్వాత జగన్ బుజ్జగించడంతో మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవలి ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ జగన్ తీరుపై బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి బాలినేని రాజీనామా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఐతే ప్రతిసారీ ఆయన అనుచరులు ఖండిస్తూ వచ్చారు. ఈసారి మాత్రం ఆయన అనుచరులే బాలినేని రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని చెప్తున్నారు. కాగా, ఇప్పుడు బాలినేని ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తిగా మారింది. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో బాలినేనికి విబేధాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బాలినేని జనసేన కండువా కుప్పుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.