ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి బిగ్‌షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.పెందుర్తి నుంచి తను లేదా తన కొడుకు అప్పలనాయుడును బరిలోకి దింపాలని ప్లాన్ చేసుకున్నారు బండారు. కానీ పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని సమాచారం.
జనసేనకు కేటాయించిన సీట్లు యలమంచిలి, అనకాపల్లి, విశాఖ సౌత్‌లోని టీడీపీ అసంతృప్తులతోనూ ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వారందరిని కలుపుకుని బండారు సత్యనారాయణ వైసీపీలో చేరతారని తెలుస్తోంది. అటు బండారుకు వైసీపీ అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
తెలుగుదేశం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుకు పిల్లనిచ్చిన మామ బండారు సత్యనారాయణ. టికెట్ దక్కకపోవడంతో బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు ఇటీవల ఓ ఆసక్తికర ట్వీట్ కూడా చేశారు. అన్ని గుడ్లు ఒకే బాస్కెట్ లో ఎప్పుడూ పెట్టకూడదు అనే పాత సామెతను గుర్తు చేశారు. అంటే కుటుంబం అంతా ఒకే పార్టీలో ఉండడం వల్ల తమకు అవకాశాలు రాలేదని అప్పలనాయుడు ఆలోచనగా తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగుదేశం నుంచి బండారు సత్యనారాయణ అల్లుడు కింజరపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. ఆయన బాబాయి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. రామ్మోనాయుడు సోదరి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో తమకు అవకాశం మిస్ అయిందనే భావనలో బండారు ఫ్యామిలీ ఉందని సమాచారం.