టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ప్రధాని నరేంద్ర మోడీకి ఏ మాత్రం నమ్మకం లేనట్లుంది. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ మొక్కుబడిగా మాత్రమే చేరినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి వచ్చేది లేదు, పోయేది లేదు కాబట్టి పొత్తుకు అంగీకరించినట్లు అనుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు పెద్దగా చంద్రబాబుతో కలిసి పాలు పంచుకోవడం లేదు. కూటమి మేనిఫెస్టోను విడుదల చేసిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీ అనాసక్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
కూటమి మేనిఫెస్టో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కావాల్సింది. మీడియాకు కూడా ఈ మేరకు సమాచారం అందించారు. మీడియా ప్రతినిధులు 12 గంటలకే వచ్చి వేచి చూడడం ప్రారంభించారు. చివరకు ఎప్పుడో సాయంత్రం మేనిఫెస్టోను చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విడుదల చేశారు. బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ మొక్కుబడిగా సమావేశంలో కూర్చుకొన్నారు. మేనిఫెస్టో ప్రతిని పట్టుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. చివరగా, మేనిఫెస్టోను అమలు చేయాల్సిన బాధ్యత టీడీపీ, జనసేనలదేనని ఆయన చేతులు దులిపేసుకున్నారు. వారికి తమ మద్దతు ఉంటుందని మాత్రమే చెప్పారు.
మేనిఫెస్టోపై ప్రధాని మోడీ ఫొటో గానీ, ఇతర బీజేపీ నేతల ఫొటోలు గానీ ప్రచురించడానికి బీజేపీ అంగీకరించలేదని సమాచారం. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఫొటో గానీ, ఇతర రాష్ట్ర నాయకుల ఫొటోలు గానీ ఉండకూడదని బీజేపీ పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు మేనిఫెస్టోపై తన ఫొటో, పవన్ కల్యాణ్ ఫొటోల పక్కన కమలం గుర్తును అచ్చు వేయించారని సమాచారం. అయితే, దాన్ని కూడా తీసేయాల్సిందేనని సిద్ధార్థనాథ్ సింగ్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోపై కమలం గుర్తును తీసేయడానికి చంద్రబాబు సమయం తీసుకున్నట్లు, దానివల్లనే మీడియా సమావేశం ఆలస్యంగా జరిగినట్లు సమాచారం. ఆచరణ సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టోను రూపొందించడం బీజేపీకి నచ్చలేదని అంటున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా కేంద్ర నాయకుల సూచనల మేరకే మీడియా సమావేశానికి దూరంగా ఉన్నట్లు చెప్పుతున్నారు.
మేనిఫెస్టో విడుదలలో జోక్యం చేసుకోకపోవడానికి, మోడీ ఫొటో వద్దని చెప్పడానికి బీజేపీకి బలమైన కారణమే ఉందని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ముగ్గురి ఫొటోలతో మేనిఫెస్టోను విడుదల చేసి, ఆ మేనిఫెస్టో ప్రతులను టీడీపీ ఇంటింటికీ పంచింది. అయితే, ఆ హామీలను పావు వంతు కూడా అమలు చేయలేదు. ఆ మేనిఫెస్టో ప్రతిని పట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి సభలోనూ దులిపేస్తున్నారు. 2014లో ఈ ముగ్గురి ఫొటోలతోనే మేనిఫెస్టోను విడుదల చేశారని, ఇప్పుడు ఆ ముగ్గురే కలిసి వస్తున్నారని అంటూ ఒక్కో హామీని చదువుతూ అవి అమలు కాకపోవడాన్ని ఎత్తి చూపుతున్నారు.
గతంలో కూటమి ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదని జగన్ ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి సభలోనూ చెప్పుతున్నారు. అవి అమలు కాలేదని ప్రజల చేత అనిపిస్తున్నారు. తద్వారా చంద్రబాబు ఇచ్చే హామీలు ఏవీ అమలు కావని, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేస్తారని ఆయన వివరిస్తున్నారు. ఈ విషయం మోడీకి కూడా చేరినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కావని, వాటిని చంద్రబాబు అమలు చేయబోరని బీజేపీ గట్టిగానే అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కోసం తాము నిజాయితీని కోల్పోకూడదనే ఉద్దేశంతో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లనే కూటమి మేనిఫెస్టో విషయంలో అంటీముట్టనట్లు వ్యవహరించిందని సమాచారం.
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చునని చంద్రబాబు అనుకున్నారు. కానీ ఆ సహకారం కూడా బీజేపీ నుంచి ఆయనకు లభించడం లేదు. దీంతో చంద్రబాబు తీవ్రమైన నిరాశకు గురైనట్లు చెప్పుతున్నారు.