టీడీపీ, జనసేనతో కూటమి కట్టడానికి బీజేపీ ఎంత వరకు సన్నద్ధమైందో ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఇంకా తేల్చనేలేదు. ఈ లోగానే రాష్ట్ర బీజేపీ నాయకులు ఆశల పల్లకిలో తేలిపోతున్నారు. 2014లో మూడు పార్టీల పొత్తులో తాము పోటీ చేసిన స్థానాల్లో మళ్లీ తామే పోటీ చేస్తామని కర్ఛీఫ్‌లు వేసేస్తున్నారు. ఆలీ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఇదెక్కడి గోలరా అని టీడీపీ, జనసేన నేతలు తలపట్టుకుంటున్నారు.
రాజమండ్రి, తాడేపల్లిగూడెం, కైకలూరు, విశాఖ
2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీల పొత్తులో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. మొత్తం 11 స్థానాల్లో పోటీ చేస్తే రాజమండ్రి అర్బన్ సీటు నుంచి ఆకుల సత్యనారాయణ, తాడేపల్లిగూడెం నుంచి పైడికొండల మాణిక్యాలరావు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, విశాఖ నార్త్‌లో విష్ణుకుమార్‌రాజు గెలిచారు. ఈ సారి అంతకంటే ఎక్కువ సీట్లే అడుగుతోంది. ఈ నేపథ్యంలో తమ పాత సీట్లన్నీ తమకే కావాలని బీజేపీ లీడర్లు ప్రచారం మొదలుపెట్టేశారు.
కైకలూరులో కామినేని.. తాడేపల్లిగూడెంలోనూ రెడీ
పొత్తు ఖరారైతే కైకలూరు సీటు తమ నేత కామినేనికి ఇవ్వాలని బీజేపీ లీడర్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాడేపల్లిగూడెం టికెట్‌పైనా అక్కడి బీజేపీ నేతలు కర్చీఫ్ వేస్తున్నారు. ఇప్పటికే అక్కడ టీడీపీ, జనసేన నేతలు టికెట్ కోసం గట్టిగా పోటీపడుతున్నారు. బీజేపీ వస్తే టికెట్ పోటీ మరింత టఫ్‌గా మారిపోతుంది. రాజమండ్రి అర్బన్, విశాఖ నార్త్‌పైనా బీజేపీ నేతలు గట్టిగానే పట్టుబట్టే అవకాశం ఉంది. గతంలో తాము గెలిచిన సీట్లు కాబట్టి ఈ నాలుగు స్థానాల్లో మాత్రం టికెట్ లడాయి ఖాయమే.