బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి కావడం సంచలనం సృష్టించింది. దీన్ని ఎల్లో మీడియా, టీడీపీ, జనసేన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేశాయి. ఈ ప్రభుత్వం(జగన్ ప్రభుత్వం) రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని, డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడం వెనక అధికార పార్టీ హస్తం ఉండవచ్చునని, ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అన్నారు.
ఏపీకి రాజధాని లేకుండా చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల అడ్డాగా మార్చిందని, ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు ఇక్కడే ఉంటున్నాయని, విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరకడం ఆందోళన కలిగిస్తోందని, ఏపీలో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలని జనసేన అధ్యక్షుడు, చంద్రబాబు మిత్రుడు పవన్ కల్యాణ్ అన్నారు.
ఆ రెండు కోయిలలు తొందరపడి ముందే కూశాయని వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తేలిపోయింది. వాస్తవాలను అసలు పట్టింపు లేకుండా వారిద్దరూ ఆ వ్యవహారాన్ని వైఎస్పార్ సీపీ మీదికి, జగన్ ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులపైకి, పోర్టు అధికారులపైకి కూడా చంద్రబాబు నెట్టే ప్రయత్నం చేశారు.
నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాల పేర్లే…
విశాఖ సముద్ర తీరానికి 25 వేల కిలోల మాదక ద్రవ్యాలతో చేరిన కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి సీఈవో. విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న ఈ కంపెనీ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.వి.ఎల్.ఎస్. గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె. భరత్ కుమార్‌లను అధికారులు రప్పించారు. కంటైనర్, సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని ప్రశ్నించారు.
డ్రగ్స్ వ్యవహారంలో నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాల పేర్లు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించిన కోటయ్య చౌదరి, వీరభద్రరావులకు ఆయా కుటుంబాలతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కుమారుడు, సమీప బంధువు ప్రసాదరావులతో కలిసి సంధ్య ఆక్వానీ కంపెనీ ఏర్పాటైనట్లు స్పష్టమైంది.
చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తోడల్లుడు గీతం భరత్ కుటుంబంతోనూ వీరభద్రరావుకు ఉన్న సంబంధాలు వెలుగు చూశాయి. టీడీపీ నేతలు దామచర్ల సత్య, ఎంపీ లావు కృష్ణదేవరాయలుతో కోటయ్య చౌదరికి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది.
కూనం వీరభద్రరావు చరిత్ర ఇదీ..
సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కూనం వీరభద్రరావు మామూలోడు కాదు. ప్రకాశం జిల్లాకు చెందిన ఇతను దగ్గుబాటి పురంధేశ్వరి మాజీ వియ్యంకుడికి చెందిన సంధ్య మెరైన్‌లో భాగస్వామిగా ఉన్నాడు. కూనం వీరభద్రరావుపై అమెరికా పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జులై 30న లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న విమానంలో తన పక్కన నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై అతను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనలో వీరభద్రరావును ఎఫ్‌బీఐ అరెస్టు చేసి న్యూయార్క్ కోర్టులో హాజరు పరిచారు. ఓ తెలుగు సంఘం ప్రతినిధుల సహకారంతో ఆయన బయటకు వచ్చాడు.
టీడీపీ నాయకులు దామచర్ల, లావు కృష్ణదేవరాయలు, రాయపాటి జీవన్‌లతో నిందితుడు కోటయ్య చౌదరికి సన్నిహిత సంబంధాలున్నాయి. దామచర్ల సత్య టీడీపీ అధ్యక్షుడు నారా చంరదబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. దామచర్ల సత్య చంద్రబాబుతో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కోటయ్య చౌదరి రాయపాటి జీవన్‌తో ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంధ్య ఆక్వా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివరణ..
విశాఖ తీరంలో 25 వేల కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడిన విషయంపై సంధ్య ఆక్వా ఎగ్జిక్యూటివ్ హరి వివరణ ఇచ్చారు. ఇందులో ఆయన సన్నాయి నొక్కులు నొక్కారు. విచారణకు సహకరిస్తామని అంటూనే రాజకీయాల కోసం కొన్ని పార్టీలు దీన్ని వాడుకోవడం విచారకరమన్నారు.
రొయ్యల మేతలో వాడే ఈస్ట్ కోసం తొలిసారి బ్రెజిల్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చామని, తక్కువ ధరకే క్వాలిటీ ఈస్ట్ లభిస్తుండడంతో ఐసీసీ బ్రెజిల్ కంపెనీకి డిసెంబర్‌లో డబ్బు చెల్లించామని, జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలుదేరి మార్చి 16న విశాఖకు చేరుకుందని, ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ సమక్షంలో కంటైనర్‌లోని డ్రగ్‌ను పరీక్షించారని, నిషేధిత డ్రగ్‌గా సిబీఐ అనుమానిస్తోందని, తమ ప్రమేయం ఏమీ లేదని ఆయన అన్నారు.