ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొరపాటున టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ప్రతి నెలా 15వ తేదీకి కూడా ప్రభుత్వోద్యోగులకు జీతాలు రావని విశ్రాంత ఉద్యోగులు, మేధావులు, విద్యావేత్తలు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వోద్యోగులను చంద్రబాబు ముప్పు తిప్పలు పెట్టినట్లు వక్తలు తెలిపారు. సమస్యలపై ప్రశ్నిస్తే తోకలు కత్తిరిస్తానంటూ ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు దెబ్బ తీశారని అన్నారు. చంద్రబాబును నమ్మవద్దని వారు హెచ్చరించారు.
ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ‘ప్రజలు – ప్రభుత్వం – ఉద్యోగులు’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఉద్యోగులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య అన్నదమ్ముల సంబంధం ఉందని వక్తలు అన్నారు. సామాన్య ప్రజలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల డిమాండ్లు ఉండాలని వారన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరి కాదని వారన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగుల వ్యవస్థ కనుమరుగైనా ఆశ్చర్యం లేదని వారు హెచ్చరించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఓపెన్ మైండ్స్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. రాజశేఖర రెడ్డి అన్నారు.
రాష్ట్ర బడ్జెట్‌లో సగం ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతోందని, మిగిలిన సగం నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు ఖర్చు చేయాల్సి ఉందని, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థను ప్రవేశపెట్టారని, కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన అన్నారు.