ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి విషయంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి ఎదురు తిరుగుతున్న సూచన కనిపిస్తున్నాయి. జరిగిన దాడిని తక్కువ చేయాలని, జగన్ ను చులకన చేయాలని, దాన్ని జగన్ మీదికే నెట్టాలని టీడీపీ చూస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో జగన్ మీద కత్తితో దాడి జరిగినప్పుటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన దాడి విషయంలో అనుసరించిన కుట్రపూరిత వైఖరినే టీడీపీ ఇప్పుడు కూడా అనుసరించాలని అనుకుంటే పొరపాటే. అప్పుడు ఆ విషయం రాష్ట్రానికే పరిమితమైంది. కానీ ఇప్పటి పరిస్థితి అలా కాదు. వైఎస్ జగన్ ప్రస్తుతం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దానివల్ల జాతీయ స్థాయిలో దానికి ప్రాధాన్యం ఏర్పడింది. జగన్ పై దాడి జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ హుందాగా వ్యవహరించి దాన్ని ఖండించారు. మోడీ స్పందించిన తర్వాత చంద్రబాబు సర్దుకున్నారు. దాడిని ఖండిస్తూ నెపాన్ని అధికారుల మీదికి, పోలీసుల మీదికి నెట్టే ప్రయత్నం చేశారు.
జగన్ పై జరిగిన దాడిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించారు. అంటే, జగన్ పై ప్రస్తుతం జరిగిన దాడి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జరిగిన దాడిని డ్రామాగా చిత్రీకరించినట్లే ప్రస్తుతం జరిగిన దాడిని కూడా చిత్రించే ప్రయత్నాలు సాగవు గాక సాగవు
ఆదివారంనాడు పాయకరావుపేటలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు నీచంగా మాట్లాడారు. జగనే ఆ దాడి చేయించుకున్నారని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దాడిని డ్రామాగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అత్యంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు. దాడి జరిగిన మరుక్షణం నుంచి ఎల్లో బ్యాచ్ రెచ్చిపోయి కోడికత్తి -2 అంటూ, కమలాసన్ – కోడికత్తి అంటూ వ్యాఖ్యలు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇంకాస్తా రెచ్చిపోయి ఆ రాయి తాడేపల్లి నుంచి వచ్చిందని వ్యాఖ్యానించారు.
అచ్చెన్నాయడు, పయ్యావుల కేశవ్ వంటి పలువురు టీడీపీ నాయకులు ఏ మాత్రం పట్టింపు లేకుండా జగన్ మీద జరిగిన దాడిని ఆయన మీదికే నెట్టేలా వ్యాఖ్యలు చేశారు. దాడికి సంబంధించిన నిజానిజాలేమిటో తెలియకుండానే, తెలుసుకోకుండానే వారు వ్యాఖ్యలు చేయడం వెనక రాజకీయ కుట్ర ఉందనేది సామాన్యులకు కూడా అర్థమవుతుంది.
అయినా, జగన్ కు గాయం కంటికి చేరువలో అయింది. తనంత తాను దాడి చేయించుకుంటే ప్రాణాలు పోయే విధంగా చేయించుకుంటాడా అనే కనీస విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. కొద్దిగా అటూ ఇటూ అయితే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. రాళ్లతో కొట్టండి, జగన్ ను మసి చేయండి అని గతంలో చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లనే ఈ దాడి జరిగిందని ఎందుకు అనుకోకూడదు? మొత్తంగా, జగన్ మీద జరిగిన దాడి పట్ల టీడీపీ అనుసరిస్తున్న వైఖరితో తన కంటిని తానే చంద్రబాబు పొడుచుకుంటున్నారనేది స్పష్టంగానే అర్థమవుతోంది.