పొత్తు ఖరారు చేసుకోవడానికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చిక్కుల్లో పడేసినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆయన, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. అమిత్ షాను కలిశారు. ఈ భేటీలో పొత్తు ఖరారైనట్లు సమాచారం. అయితే, అమిత్ షాతో సమావేశం తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుకుండానే వెళ్లిపోయారు. అమిత్ షాను కలిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడకపోవడం ఇది రెండోసారి.
అమిత్ షా పెట్టిన షరతు చంద్రబాబుకు మింగుడు పడలేదని సమాచారం. పొత్తులపై శుక్రవారం స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. గతంతో బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అమిత్ షా చంద్రబాబును డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో చంద్రబాబు కక్క లేక మింగలేక మీడియాకు ముఖం చాటేసినట్లు ప్రచారం జరుగుతోంది.
పైగా, సీట్ల పంపకంలో కూడా బీజేపీ భారీ వాటాలనే అడుతున్నట్లు సమాచారం. 8 నుంచి 10 లోక్‌సభ స్థానాలు, 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు తమకు కేటాయించాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు నుంచి పార్టీ పరిస్థితిపై సమాచారం తీసుకున్న తర్వాత టీడీపీ, జనసేనలతో పొత్తుపై బీజేపీ అగ్ర నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
టీడీపీ 2018లో ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చిన తర్వాత విశాఖ, రాజంపేట, హిందూపురం, తిరుపతి, అరకు, విజయవాడ లోక్‌సభ స్థానాల్లో దృష్టి పెట్టామని, ఈ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందని రాష్ట్ర బీజేపీ నాయకులు అగ్ర నాయకత్వంతో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ, జనసేనలతో సీట్ల పంపకాల విషయంలో ఏ మాత్రం తగ్గకూడదని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
ఒకటి, రెండు రోజుల్లో బీజేపీ తాము పోటీ చేసే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఈm లోపల టీడీపీ, జనసేనలతో సీట్ల పంపకాలు తాము అనుకున్నట్లు జరగకపోతే ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ, టీడీపీ తమతో పొత్తు కావాలనుకుంటే ఆ సీట్లను తమకు వదిలేస్తుందని వారు అనుకుంటున్నట్లు సమాచారం.