కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రంలో సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు విస్మరించాయి. శనివారం టీడీపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర జనాభాలో 0.83 శాతంగా ఉన్న బ్రాహ్మణులకు ఒక్క టికెట్‌ను కూడా కేటాయించలేదు. 2009 అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఇప్పటివరకూ ఒక్క బ్రాహ్మణుడికి టికెట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ. అంటే గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నమాట.
ఎన్టీ రామారావు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కరణం రామచందరావుకు ప్రతిసారి తన కేబినెట్లో చోటు ఇచ్చేవారు. అయితే పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతుల్లోకి వెళ్లాక క్రమంగా ఆ పార్టీలో బ్రాహ్మణుల ప్రాతినిథ్యం తగ్గుతూ వచ్చింది. దీనికి విరుద్ధంగా మళ్లీ రాజశేఖర్ రెడ్డి బ్రాహ్మణులకు అనేక పదవులు ఇచ్చారు. ఉండవల్లి అరుణ్‌కుమార్, ద్రోణం రాజు శ్రీనివాస్, మల్లాది విష్ణు లాంటి వాళ్లు ఆయన హయాంలో ఓ వెలుగు వెలిగారు. వైఎస్ జగన్ సైతం రాజశేఖర్ రెడ్డిని ఫాలో అయ్యారు.
2014లో బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతిని పోటీకి దింపింది వైసీపీ. 2019లోనూ మళ్లీ పోటీకి దింపి, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గానూ పదవిని కట్టబెట్టారు జగన్. అంతేకాకుండా విజయవాడ నుంచి మల్లాది విష్ణు, విశాఖ నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్‌లను అవకాశం కల్పించింది. అయితే విష్ణు విజయం సాధించారు, ద్రోణంరాజు ఓడిపోయారు. ద్రోణంరాజును విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా నియమించారు జగన్.
94 అసెంబ్లీ స్థానాలు ప్రకటించిన టీడీపీ ఒక్క బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వలేదు. ఇక జనసేన బ్రాహ్మణులను పోటీ పెట్టే అవకాశాలు లేవు. అయితే బీజేపీతో తెలుగుదేశం పొత్తు కారణంగా బ్రాహ్మణ సామాజికవర్గం టీడీపీకి ఓటు వేస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన 94 స్థానాల్లో అత్యధికంగా చంద్రబాబు తన సొంత సామాజిక వర్గం కమ్మలకు 20 స్థానాలు ఇచ్చారు. తర్వాత ఎస్సీలకు – 20, బీసీలకు – 18, రెడ్డి సామాజికవర్గానికి – 17, వైశ్యులకు- 2, క్షత్రియులకు- 4, కాపు సామాజికవర్గానికి – 7 స్థానాలు కేటాయించారు.