టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు టికెట్ల కేటాయింపులో అగ్రకులాలవారికే అగ్రతాంబూలం ఇచ్చారు. తన సామాజిక వర్గానికి చెందినవారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. కమ్మ సామాజికవర్గానికి మాత్రమే కాకుండా రెడ్లకు కూడా ఇతోధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన టికెట్ల పంపకాన్ని చూస్తే సామాజిక న్యాయం ఎలా సాధిస్తారనేది ప్రశ్నగానే మిగులుతుంది. బీసీలకు పట్టం కడుతానని, టీడీపీ బీసీల పార్టీ అని చెప్పే చంద్రబాబు మాటలన్నీ అబద్ధమేనని తేలిపోతుంది.
బీజేపీ, జనసేనలతో పొత్తు కారణంగా చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 144 సీట్లకు పోటీ చేస్తోంది. వీటిలో తన కమ్మ సామాజికవర్గానికే 32 సీట్లను కేటాయించారు. బీజేపీలో ఉన్నప్పటికీ తనవాడే అయిన సుజనా చౌదరికి అదనంగా ఓ సీటు ఇప్పించుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం చేస్తున్న ఎల్లో బ్యాచ్ కు, ఎల్లో మీడియాకు చంద్రబాబు రెడ్లకు కేటాయించిన స్థానాలే సమాధానం చెప్పుతాయి. రెడ్లకు చంద్రబాబు 144 స్థానాల్లో 25 స్థానాలు కేటాయించారు. తన 144 స్థానాల్లో రెండు సామాజిక వర్గాలకే ఆయన 57 సీట్లు కేటాయించారు. ఇక మిగిలింది 87 స్థానాలే. వీటిని మిగతా సామాజిక వర్గాలకు పంచిపెట్టారు. ఇదే చంద్రబాబు బీసీ నినాదం గుట్టు
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో అవునన్నా, కాదన్నా రాజకీయంగా రెడ్లదే ఆధిపత్యం. అందువల్ల రెడ్లకు సీట్లు కేటాయించకుండా చంద్రబాబు కూడా తప్పించుకోలేరు. అయితే, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు సీట్లు కేటాయించాల్సి వచ్చింది. తన సామాజికవర్గం ఆధిపత్యాన్ని రాయలసీమలో స్థాపించడానికి, విస్తరించడానికి చంద్రబాబుకు అది అవసరం.
దానికితోడు, కొంత మంది రెడ్లకు వైఎస్ జగన్ సీట్లను నిరాకరించి, బీసీ, మైనారిటీలకు కేటాయించారు. ఆ రెడ్లు టీడీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీకి సిద్ధపడ్డారు. వారికి చంద్రబాబు టికెట్లు ఇచ్చారు.