రాయలసీమ ప్రాంతంలో టికెట్ల కేటాయింపులో అధికంగా ఉన్న బలిజలకు మొండిచేయి చూపి, తన కమ్మ సామాజిక వర్గానికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేశారు. ఓటు బ్యాంక్ బలిజలు కాగా, టీడీపీ అభ్యర్థులు కమ్మవాళ్లు. రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో బలిజ ఓటర్లు యాభై వేలకు పైగానే ఉన్నారు. తిరుపతి, బద్వేల్, రైల్వే కోడూరు, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలిజ ఓటర్లు గణనీయంగా ఉన్నారు.
గతంలో బీసీలతో పాటు బలిజలు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే, బీసీలు టీడీపీకి దూరమయ్యారు. బలిజలు మాత్రం టీడీపీతోనే ఉన్నారు. బలిజలు ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నారు. బలిజలు పదివేలు, ఇరవై వేలు ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. దాంతో బలిజలు ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత వారిలో నిరుత్సాహం చోటు చేసుకుంది.
పవన్ కల్యాణ్ జనసేనను స్థాపించిన తర్వాత వారికి తిరిగి ఉత్సాహం వచ్చింది. అయితే, రాయలసీమలో సీట్ల కేటాయింపులో జనసేనకు దక్కిన స్థానాలు చాలా తక్కువ. నాలుగు జిల్లాల పరిధిలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేనకు రెండు సీట్లు మాత్రమే కేటాయించారు. బలిజల జనాభాపరంగా చూస్తే రెండు సీట్లు అసలు లెక్కలోకే రావు. తిరుపతి, రైల్వే కోడూరులు మాత్రమే జనసేనకు దక్కాయి.
కీలకమైన అనంతపురం జిల్లాలో కమ్మవాళ్లకు టీడీపీ తరఫున ఐదు సీట్లు దక్కాయి. పరిటాల సునీత, బాలకృష్ణలతో పాటు కల్యాణదుర్గం, అనంతపురం, ఉరవకొండ అభ్యర్థులు కూడా కమ్మ సామాజికవర్గం నేతలే. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కమ్మ సామాజివర్గం జనాభా రెండు శాతం కూడా ఉండదు. బలిజల జనాభా 15 శాతం వరకు ఉంటుంది. జనసేనతో పొత్తు పెట్టుకుని బలిజల ఓట్లను గంపగుత్తగా లాగేద్దామని చంద్రబాబు ఎత్తు వేశారు.