టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ పదేళ్లలో దేశంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సంభవించిన పరిణామాలను అర్థం చేసుకున్నట్లు లేరు. 2014 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని కలలుగన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆయన 2014 నాటి పొత్తులకు వెంపర్లాడారు. బీజేపీతోనూ జనసేనతోనూ పొత్తు పెట్టుకుని 2014లో ఆయన పోటీ చేసి విజయం సాధించారు. అయితే, అది కూడా భారీ విజయమేమీ కాదు. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 62 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. దీన్ని బట్టి టీడీపీ విజయం గొప్పదేమీ కాదని అర్థం చేసుకోవచ్చు.
2014కు ఇప్పటికి పరిస్థితులు చాలా మారిపోయాయి. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన గుజరాత్ మోడల్ అంటూ ముందుకు రావడంతో యువత చాలా వరకు ఆయన వైపు మొగ్గు చూపింది. దేశాన్ని సరైన నాయకుడు లభించాడనే అభిప్రాయాన్ని ఆయన కలిగించగలిగారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉత్తరాదిని పక్కన పెడితే మోదీ పట్ల దక్షిణాదిన అంతటి మొగ్గు లేదు. గుజరాత్ మోడల్ అనేది తేలిపోయింది. పైగా, ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ వర్గానికే కాదు, హిందూ మెజారిటీలోని ఓ వర్గానికి కూడా నచ్చడం లేదు. ఇతర మైనారిటీ వర్గాల్లో కూడా భయాందోళనలు మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే మోదీ నిర్ణయాలు, ప్రకటనలు ముస్లిం, ఇతర మైనారిటీ వర్గాలను కూటమికి దూరం చేసే అవకాశాలున్నాయి. ముస్లిం రిజర్వేషన్లు, యూసీసీ, సీఏఏ వంటి నిర్ణయాల వల్ల బీజేపీకి ఆ వర్గాలు దూరం జరిగాయి. 2014లో మోదీ ప్రజల ముందుకు వచ్చినప్పుడు అంత తీవ్రంగా వ్యతిరేకత లేదు. ఇది టీడీపీ కూటమిపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో పోటీకి దిగలేదు. బేషరతుగా టీడీపీ, బీజేపీకి ఆయన మద్దతు ప్రకటించారు. పవన్ కల్యాణ్ పట్ల అప్పట్లో ఇప్పటి కన్నా ఎక్కువ సానుకూలత ఉంది. కాపు సామాజికవర్గం పూర్తిగా ఆయనను నమ్మకుంది. ప్రస్తుతం ఆయన టీడీపీతో సీట్లను పంచుకున్నారు. 21 అసెంబ్లీ స్థానాలకు ఆయన పార్టీ పోటీ చేస్తోంది. అయితే, ఈ 21 స్థానాల్లో సగానికి పైగా చంద్రబాబు మనుషులే ఉన్నారు. పవన్ కల్యాణ్ పక్కన పదేళ్ల పాటు నిలబడినవారు మోసానికి గురయ్యామనే భావనకు వచ్చారు. పోతిన మహేష్ వంటి కొంత మంది పార్టీని వీడగా, కొంత మంది సైలెంట్ అయ్యారు. దీనివల్ల కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్ రాజకీయ వ్యక్తిత్వం మసకబారింది. కాపు సామాజికవర్గం ఆయన పక్కన గంపగుత్తగా నిలబడడం లేదు.
ఇక, చంద్రబాబు విషయానికి వస్తే… రాష్ట్ర విభజన కారణంగా కూడా ప్రజలు కొంత మేర చంద్రబాబు వైపు మొగ్గు చూపారు. మోదీతో పొత్తు, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి మేలు చేస్తుందని ప్రజలు విశ్వసించారు. కానీ, అవేవీ ఉపయోగపడలేదు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు నీళ్లొదిలారు. పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. విశాఖ రైల్వే జోన్ సాకారం కాలేదు. మోదీ మద్దతు, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విస్మరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఆయన రాజకీయ వ్యక్తిత్వంపై అవినీతి మచ్చ పెరిగి పెద్దదైంది. గతంలో ఆయన ఏదో విధంగా మచ్చ తనపై పడకుండా చూసుకుంటూ వచ్చారు. కానీ, ప్రస్తుతం ఆయన దాన్ని తప్పించుకోలేకపోయారు. ముఖ్యంగా అమరావతి రాజధాని పేర ఆయన చేసిన భూదందాలు కళ్లకు కట్టినట్లు బయటకు వచ్చాయి.
ఈ స్థితిలో 2014 రిపీట్ అవుతుందనేది చంద్రబాబు అత్యాశగానే కనిపిస్తోంది. అది ఎదురు తిరిగే పరిస్థితే కనిపిస్తోంది. ఇకపోతే, గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్ పాలన చూశారు. లంచాలకు, పైరవీలకు తావు లేకుండా సంక్షేమ పథకాల ఫలితాలను ఇంటి వద్దకు చేర్చే వలంటీర్ వ్యవస్థ ప్రయోజనాన్ని అనుభవించారు. చెప్పింది చేయడం, చేసేదే చెప్పడం వైఎస్ జగన్‌కు ప్రజల్లో సానుకూలత ఏర్పరిచింది. మొత్తం మీద, చంద్రబాబు 2014ను రిపీట్ చేయడం అనేది సాధ్యం కాని విషయంగానే మారింది.