ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని, ఆ సంక్షేమ పథకాల సొమ్మును కూడా పెంచి ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పుతున్నారు. అంతేకాకుండా సూపర్ సిక్స్ పేరిట మరికొన్ని కొత్త పథకాలను కూడా ఆయన ప్రకటించారు. ఈ మొత్తం పథకాలను అమలు చేయడానికి ఏటా దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఇవన్నీ ఎలా అమలు చేస్తారంటే, సంపద సృష్టిస్తానని చెప్పుతున్నారు. ఆ సంపదను ఎలా సృష్టిస్తారనే విషయం మాత్రం చెప్పడం లేదు. పైగా, తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన ఐదేళ్లలో ఆయన ఎంత సంపద సృష్టించారంటే, ఏమీ లేదనే సమాధానమే వస్తుంది.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చిన హామీలను చంద్రబాబు పట్టించుకోలేదు. అప్పుడు తాను ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సంపదను ఎందుకు సృష్టించలేదనే ప్రశ్నను తప్పకుండా చంద్రబాబుకు వేయాల్సిందే. ప్రజలను మభ్యపెట్టడానికి కొత్తగా సంపద సృష్టి అనే మంత్రాన్ని ఆయన జపిస్తున్నారు. గతంలో ఆయన సంపద సృష్టించకపోగా లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ప్రజలపై మోపారు. ప్రభుత్వ భూములను అమ్మేశారు. తన మనుషులకు, తన వర్గంవారికి వేల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయల వరకు పంచిపెట్టారు. చంద్రబాబు సృష్టించిన సంపద ఏమీ లేదని కాగ్, రిజర్వ్ బ్యాంక్ నివేదికలే వెల్లడించాయి.
తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అప్పులను పెంచుకుంటూ వెళ్లారు. ప్రతి బడ్జెట్‌లోనూ రెవెన్యూ లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. పరిశ్రమల నుంచి, సేవా రంగం నుంచి వాటాలను భారీగా తగ్గించడం వల్ల పెరుగుదల గణనీయంగా తగ్గిపోయింది. చంద్రబాబు పాలన చూస్తే ఓ వైపు కుంభకోణాలు, మరో వైపు అప్పులు మాత్రమే.
అప్పులు చేయకుండా ఆయన పాలన సాగించిన రోజు లేదు. రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.90 వేల కోట్లు. చంద్రబాబు దిగిపోయేనాటికి రూ.4.12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఏటా దాదాపు 21.87 శాతం అప్పులను పెంచుకుంటూ వెళ్లారు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి ఆయన అప్పుల చేశారు. ఈ విషయాన్ని కాగ్, రిజర్వ్ బ్యాంక్ నివేదికలే వెల్లడించాయి. చంద్రబాబు చేసిన అప్పులతో కలిపితే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.10 లక్షల కోట్లు. చంద్రబాబు దాన్ని రూ.14 లక్షల కోట్లుగా చెప్పుతున్నారు. రాజ్ దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే విషయం చెప్పారు.
మాట్లాడితే చంద్రబాబు నోటి వెంట అబద్ధాలే వస్తాయి. లెక్కలు కనిపిస్తున్నప్పుడు కూడా ఆయన అంత అబద్ధం ఆడుతున్నారంటే చెప్పే ప్రతి మాటా అబద్ధమే ఎందుకు కాకూడదు? చంద్రబాబు సంపద సృష్టి మాత్రం పెద్ద బోగస్. ఎన్నికల సమయంలో ప్రజలను మధ్యపెట్టడానికి ఆయన ఎన్ని అబద్ధాలైనా చెప్తారు.