ఫార్టీ ఇయర్స్ చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిని పదేపదే టార్గెట్ చేస్తున్నారు. పది రోజులు కాగానే మళ్ళీ జగన్ దారిలోనే వెళ్తున్నారు. గతంలో కూడా ఈ విషయం రుజువైనా తాజాగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అదే కనబడుతోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి 94 మంది అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించిన విషయం తెలిసిందే. వీరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అనేక హెచ్చరికలు చేయటమే విచిత్రంగా ఉంది.
ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే టికెట్లు వచ్చేసిందన్న ధీమా అభ్యర్థుల్లో ఉండకూడదట. టికెట్లు వచ్చేసింది కాబట్టి తమకు ఢోకా లేదని అనుకుంటే పొరబాటే అన్నారు. ఎప్పటికప్పుడు అభ్యర్థుల పనితీరును తాను పరిశీలిస్తుంటానని వార్నింగ్ ఇచ్చారు. పనితీరు బాగాలేదని తనకు రిపోర్టు వస్తే వెంటనే మార్చేస్తానని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు అభ్యర్థుల పనితీరుపై తాను సర్వేలు చేయించుకుంటానని చెప్పారు. చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చటానికి తాను వెనకాడనని చెప్పారు. తాను ఎంపిక చేసిన అభ్యర్థులు గెలవటమే తనకు ముఖ్యమన్నారు.
అభ్యర్థులుగా ఎంపికైన దగ్గర నుండి పోలింగ్ జరిగే వరకు ప్రతిరోజు చాలా ముఖ్యమన్న విషయాన్ని అభ్యర్థులంతా గుర్తుంచుకోవాలని పదేపదే చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది, మరిదే విషయాలను జగన్ చెబుతుంటే చంద్రబాబు తప్పుపట్టారు. జగన్ కూడా తాను నియమించిన నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, సమన్వకర్తల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవటాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అవసరమైన చోట్ల ఇన్‌చార్జిలను మార్చేస్తుంటే చంద్రబాబు రకరకాలుగా ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యేల నియోజకవర్గాలను జగన్ మారిస్తే తప్పుపట్టి, ఎగతాళి చేసిన చంద్రబాబు ఇప్పుడు తానూ అదే పనిచేస్తున్నారు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని నూజివీడులో పోటీ చేయిస్తున్నారు. వైజాగ్ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో పోటీ చేయమన్నారు. జగన్ చేస్తే తప్పు అదే పని తాను చేస్తే మాత్రం ఒప్పు అన్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారం. వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకుంటే అమ్మనాబూతులు తిట్టిన చంద్రబాబు మళ్ళీ తాను కూడా వ్యూహకర్తగా రాబిన్ శర్మను నియమించుకున్నారు.
ప్రశాంత్ కిషోర్ ఏపీని కులాలవారీగా నాశనం చేసేశాడని నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు అదే ప్రశాంత్‌ను తనకు పనిచేయమని బతిమలాడుకున్న విషయం అందరు చూసిందే. ఏ విషయమైనా కానీండి ముందు జగన్ను నోటికొచ్చినట్లు తిట్టేయటం నాలుగు రోజులు పోయినాక అదే దారిలో తాను నడవటం చంద్రబాబుకు అలవాటైపోయింది. సంక్షేమ పథకాలతో జగన్ ఏపీని శ్రీలంకలాగ చేస్తున్నాడని నానా గోల చేశారు. ఇపుడేమో జగన్ అమలు చేసిన దానికన్నా రెట్టింపు పథకాలిస్తానని హామీ ఇస్తున్నారు. ఏ విషయం తీసుకున్నా జగన్ను చంద్రబాబు ఫాలో అవ్వాల్సిందే అన్నట్లుగా తయారైపోయింది వ్యవహారం.