తన తనయుడు నారా లోకేష్‌ను నిలబెట్టడానికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పొత్తులకు సిద్ధపడ్డారు. పలు ఎత్తులు వేస్తూ జిత్తులమారిన వ్యవహారాలకు పాల్పడుతున్నారు. నరేంద్ర మోడీని చూపి, పవన్ కల్యాణ్ సాయం తీసుకుని 2014లో అయన అధికారంలోకి వచ్చారు. ఆయన అనుభవంతో నేర్చుకున్నది ఏమీ లేదని రుజువైంది. తన సామాజిక వర్గానికి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు. కమీషన్ల కోసం తనవారికి ప్రయోజనం చేకూర్చడానికి పోలవరం ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మిస్తుందని తీసుకుని కొంప ముంచారు. ఏపీ రాజధాని అమరావతి అంటూ భ్రమరావతిని సృష్టించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. ప్రజా సంక్షేమాన్ని నీరు గార్చారు. దాంతో ప్రజలు ఆయనను ఇంట్లో కూర్చోబెట్టారు. ఐదేళ్ల పాటు ఆయన అధికారానికి దూరమయ్యారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి కలుగులోంచి బయటకు వచ్చారు. కుమారుడు నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసి తాను రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నారు. ఐదేళ్లలో జగన్ తేలిపోతాడనే తప్పుడు అంచనా ఆయన కలలను చెదరగొట్టింది.
ఐదేళ్లలో జగన్ మామూలోడు కాదనే విషయం ఆయనకు తెలిసి వచ్చింది. పెన్షన్లను పెంచారు. పేదలకు ఇళ్లు ఇచ్చారు. చంద్రబాబు హయాంలో కునారిల్లిన ప్రభుత్వ బడులకు కొత్త వెలుగులు తీసుకొచ్చారు. పట్టుబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. సొంత గ్రామాల్లోనే యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. జగన్‌ను ఢీకొనడం సామాన్య విషయం కాదని గ్రహించి, కన్నప్రేమను చంపుకోలేక నారా లోకేష్ కోసం కొత్త ఎత్తులతో రంగంలోకి దిగారు. పొత్తుల కోసం పడనిరాని పాట్లు పడ్డారు.
నారా లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీకి దూరం చేసి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను చేరువ చేసుకున్నాడు చంద్రబాబు. పవన్ కల్యాణ్ బలపడితే నారా లోకేష్‌కు అడ్డు వస్తాడని భావించి ఆయన కొంపముంచాడు. పొత్తు పెట్టుకుని 21 సీట్లకే పరిమితం చేసి సగం సీట్లను తనవారికే ఇప్పించుకున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ఒకటో రెండో సీట్లు గెలుస్తావు గానీ అధికారం రాదని నమ్మించి పవన్‌ను తనకు అనుకూలంగా ముగ్గులోకి దింపారు. నారా లోకేష్‌ను ఎలివేట్ చేయడానికే పవన్ కల్యాణ్‌ను తొక్కేశాడు.
కేంద్రం మద్దతు ఉంటే నారా లోకేష్‌కు భద్రత ఉంటుందని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ పెద్దల వద్ద సాగిలబడి పొత్తు కుదుర్చుకున్నారు. అయితే, బీజేపీ పెద్దల అండదండలు ఆయనకు అంతగా అందుతున్నట్లు లేదు.
ఆరు నెలల ముందే చంద్రబాబు ఈనాడు, ఎబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5లను రంగంలోకి దింపారు. తెలంగాణలో పనిచేసే పలువురు జర్నలిస్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దింపారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చే సమాచారంతో పాటు ఎప్పటిప్పుడు కొన్ని విషయాలను కల్పించి ప్రజలకు ఎక్కించేందుకు, స్థానిక యువతను రెచ్చగొట్టేందుకు సోషల్ మీడియా ద్వారా ఆ బృందాలు కుట్రలు చేస్తున్నాయి. ప్రచారానికి వచ్చిన వైసీపీ నాయకులకు నిరసన సెగలు తగులుతున్నట్లు వార్తలు సృష్టిస్తున్నారు. కొందరికి డబ్బులిచ్చి వీడియోలు రికార్డు చేయిస్తున్నారు.
ఈసారి గెలవకపోతే తన కుమారుడి బతుకు కుక్కలు చింపిన విస్తరి అవుతుందని భావించిన చంద్రబాబు మరో కుట్రకు తెర తీశారు. ప్రత్యర్థి పార్టీల మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తుందని బూటకపు దాడుల కథలు అల్లుతున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు ప్రత్యేక బృందాలను నియమించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే తనపై బ్లేడులతో దాడి చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఓ తప్పుడు ప్రకటన చేశారని సమాచారం.
చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కథలు చెప్పినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్ వైపే ఉన్నారు. జగన్‌ను గెలిపించడానికి ప్రజలే ప్రచార సారథులవుతున్నారు.