ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరదలు వచ్చాయన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. పిఠాపురం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్.. బాధితులను పరామర్శించారు. విజయవాడతో పాటు ఏలేరు వరదలకు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్‌మెంట్ విషయంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కలెక్టర్లతో చంద్రబాబు కనీసం రివ్యూ చేయకపోగా.. ప్రజలను కూడా అలర్ట్ చేయలేదన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం మానవత్వం ఉన్నా ఓ స్పెషల్ ఆఫీసర్‌ను నియమించేవారన్నారు జగన్.
గోబెల్స్‌కు చంద్రబాబు తమ్ముడిలాంటోడని సెటైర్ వేశారు జగన్. అబద్ధాన్ని కూడా అమ్మగలిగే టాలెంట్ చంద్రబాబుకి ఉందన్నారు. బాబు ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ తన వైపే వేలెత్తి చూపుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో వరదలొచ్చినా, ఏలేరు కాలువకు గండ్లు పడినా, కోవిడ్ వచ్చినా, చివరకు చంద్రబాబు ఏం చేయలేకపోయినా తానే కారణమంటున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా తన నామస్మరణ బంద్ చేసి.. నిజాయితీతో పాలన అందించాలని చంద్రబాబుకు సూచించారు. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా, ధర్మంగా ఇవ్వాల్సిన వాటిపై దృష్టి పెట్టాలన్నారు. పవన్ కల్యాణ్ కొత్తగా వచ్చారని, ఆయనకు ఏమి తెలియదన్నారు. పవన్ సినిమా ఆర్టిస్ట్ ఐతే.. చంద్రబాబు డ్రామా ఆర్టిస్టు అంటూ సెటైర్లు వేశారు జగన్.
వైసీపీ హయాంలో ప్రతి ఏడు వర్షాలు పడి రిజర్వాయర్లు నిండుగా ఉన్నాయని, అందుకే మోడ్రనైజేషన్ చేయలేకపోయామన్నారు జగన్. ఏలేరు కాలువ ఆధునీకీకరణకు వైఎస్సార్ నిధులు కేటాయించినప్పటికీ.. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కాలువను పట్టించుకోలేదన్నారు. అంచనాలు పెంచి పనులు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలన్న జగన్.. ఆయన హయాంలో కాలువ ఆధునీకీకరణ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు గత ప్రభుత్వంపై విమర్శలతో కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు జగన్.