తమలోని ఫ్రస్ట్రేషన్‌ను చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పుస్తకావిష్కరణ సభలో చూపించినట్లున్నారు. సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేష్ కుమార్ రాసిన ‘విధ్వసం’(vidhwamsam) అనే పుస్తకాన్ని చంద్రబాబు(chandrababu) ఆవిష్కరించారు. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని గురించి సురేష్ చక్కగా వివరించినట్లు చంద్రబాబు చెప్పారు. 5 కోట్ల మంది జనాల మనసుల్లోకి దూరి జనాల మనోభావాలను రచయిత తన పుస్తకంలో చక్కగా వర్ణించినట్లు చంద్రబాబు కితాబిచ్చారు. చంద్రబాబు, పవన్‌తో పాటు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తదితర జగన్ వ్యతిరేకులంతా కలిసి నోటికొచ్చినట్లు మాట్లాడారు.
వీళ్ళందరి మాటలు విన్నతర్వాత వచ్చిన అనుమానం ఏమిటంటే అసలు చంద్రబాబే జర్నలిస్టు పేరుతో జగన్‌కు వ్యతిరేకంగా పుస్తకం రాయించినట్లున్నారు. ఈ మధ్యనే ఇంకో పుస్తకం కూడా అచ్చయ్యింది. ఆ పుస్తకాన్ని కూడా చంద్రబాబే ఆవిష్కరించారు. అప్పుడు కూడా జగన్‌కు వ్యతిరేకంగా చంద్రబాబుతో పాటు వక్తలంతా నోటికొచ్చినట్లు మాట్లాడారు. అంటే న్యూట్రల్స్ పేరుతోనో లేకపోతే జర్నలిస్టుల ముసుగులో జగన్‌కు వ్యతిరేకంగా చంద్రబాబే పుస్తకాలు రాయిస్తున్నట్లున్నారు. అకారణంగా జగన్‌పై మండిపోయి వార్నింగుల మీద వార్నింగులు ఇస్తూ జగన్ పైన బురదంతా చల్లేశారు.
చంద్రబాబు, పవన్ మాటలు విన్నతర్వాత బీజేపీతో పొత్తు చర్చలు ఫెయిలయ్యిందా అనే అనుమానం పెరిగిపోతోంది. ఆ కోపమంతా జగన్ మీద చూపించారా అన్న సందేహం పెరిగిపోయింది. పొత్తు చిత్తవ్వటం అంటే బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ ఏమైందో తెలీదు మళ్ళీ బీజేపీతో పొత్తు గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. బీజేపీతో పొత్తును పక్కనపెట్టేస్తే టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటు ఏమైందో కూడా తెలీదు. తాను ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో పొత్తు గురించి మాట్లాడిన వెంటనే జగన్ ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
పొత్తుకు ఆమోదించలేని షరతులను చంద్రబాబు ముందు అమిత్ షా ఉంచారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ కారణంగానే అమిత్ షా అలాంటి షరతులను ఉంచారనే మంట చంద్రబాబు, పవన్‌లో పెరిగిపోతున్నట్లుంది. లేకపోతే జనాల జీవితాలను జగన్ పాలన ఛిన్నాభిన్నం చేసేసిందని గోలపెట్టడం ఏమిటో అర్థంకావటంలేదు. నిజంగానే తమ జీవితాలను జగన్ చిన్నాభిన్నం చేస్తే జనాలు తిరగబడకుండా ఉంటారా? ఇక్కడ ఛిన్నాభిన్నమైంది పొత్తు చర్చలు, చంద్రబాబు, పవన్ వ్యూహాలే అని అర్థమవుతోంది. బీజేపీతో పొత్తు చర్చలు ముందుకు పోకపోవటానికి జగనే కారణమన్న మంట వీళ్ళల్లో పెరిగిపోతున్నట్లుంది. అందుకనే పుస్తకావిష్కరణ పేరుతో నోటికొచ్చినట్లు మాట్లాడారు.