ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ రాను రానూ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది. రాయలసీమ పర్యటన దాటాక, నెల్లూరు నుంచీ క్రమంగా జనాదరణ తగ్గుతుందని భావించిన పచ్చ బ్యాచ్‌కి కళ్ళు బైర్లుకమ్మే ప్రజాదరణతో జగన్ మేమంతా సిద్ధం యాత్ర కొనసాగటం అస్సలు భరించరాని అంశంగా తయారయింది. గోదావరి జిల్లాల్లో, విశాఖపట్నంలో వచ్చిన ప్రజాస్పందన జగన్‌కే ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు.
పచ్చ పత్రికలకూ, చానెళ్లకు పిచ్చి పీక్స్ కి చేరింది. చంద్రబాబుకీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌కీ ఉండబట్టడం లేదు. ఫ్రస్ట్రేషన్‌లో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియడం లేదు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా ముగ్గురు మహిళల జీవితాలతో ఆడుకున్న పవన్ కళ్యాణ్ గురించి ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగాలలో హైలైట్ చేస్తుండటంతో, చంద్రబాబు వెకిలి కామెంట్లకు తెరతీశారు.
మామూలుగా చంద్రబాబు అలా నోటికేది వస్తే అది మాట్లాడే టైపు కాదు. కానీ జగన్ దెబ్బకి భయపడ్డారో ఏమో, ఆయన నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. మొన్న ఒక రోడ్ షోలో మాట్లాడుతూ..జగన్ పవన్‌తో సంసారం చెయ్యి తెలుస్తుంది అంటూ మాట్లాడారు. అంటే చంద్రబాబు పరోక్షంగా స్వలింగ సంపర్కాన్ని ప్రస్తావిస్తున్నారా? ఎల్‌జీబీటీ వర్గాల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం మొదలు పెట్టారు. స్వలింగ సంపర్కం పరస్పరం ఇష్టమున్న వ్యక్తుల మధ్య కూడా చట్ట విరుద్ధం ఇండియాలో. కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత బాధ్యతారహితంగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి బహిరంగ వ్యాఖ్యలు చెయ్యొద్దని కడప కోర్టు రూలింగ్ ఇస్తే దాన్ని విస్మరించి ఇష్టానుసారం మాట్లాడడం మరింత ఆశ్చర్యకరం. తెలుగుదేశంవాళ్ళు అయితే ట్విట్టర్‌లో పబ్లిక్‌గా కోర్టు తీర్పును ఆక్షేపించడం మరింత జుగుప్సాకరం.
ఇక పవన్ కళ్యాణ్ నోటికి తాళం వేసే నాథుడే లేడు. ఎన్నికల సంఘం ఏం చేస్తోందో తెలియడం లేదు. ఏంటి జగన్ … అనుకుంటూ నోటికొచ్చినట్టు… రాయడానికి వీలు లేని భాషలో ఈ సినిమా నటుడు తన వాచాలత్వం ప్రదర్శించడం అసహ్యకరంగా ఉంది. కొడితే బ్లూ కలర్ బ్లడ్ వస్తుందా అంటూ వాగటం … అందునా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి గురించి తన హద్దులు మర్చిపోయి పేలడం ప్రజల్లో ఏవగింపు కలిగిస్తోంది. గెలుస్తున్నామనే అభిప్రాయం కలిగిస్తున్నామనుకున్నాడో ఏమో గానీ, పవన్ కళ్యాణ్ పిచ్చి ప్రేలాపనతో పెట్రేగిపోతున్నారు. ఆయన వెనక ఉన్న మూక దానికి జై కొట్టడం, దాన్ని తెలుగుదేశంవాళ్ళు సమర్ధించడం చూస్తుంటే కూటమి కొంప కొల్లేరయిపోయిందని అర్థమయిపోయినట్టుంది బాబుకీ, ఆయన దత్తపుత్రుడికీ. భయం కనబడుతోంది వాళ్ళ మాటల్లో.. జగన్‌కి భయం ఏంటో రుచి చూపించాలని పవన్ కళ్యాణ్ పదే పదే అనడం అతని ప్రస్తుత మానసిక స్థితిని తెలియజేస్తోంది. తానే భయపడుతూ ఇంకెవరికో భయం రుచి చూపించాలనడం నవ్వొస్తోంది. ఈ పిచ్చి వాగుడుని పచ్చ చానెళ్లు యథాతథంగా ప్రసారం చేయడం ఏ రకంగా ఎన్నికల సంఘం ఉపేక్షిస్తోందో అర్థంకాదు.
వీళ్లిద్దరికీ తోడుబోయిన మనిషి జగన్ తోబుట్టువు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆవిడ అన్నకి రూ. 82 కోట్లు బాకీ పడి, అదేదో ఆయన ఆడపడుచు కట్నంగా ఇవ్వాల్సి ఉందన్నట్టు మాట్లాడటం ఆవిడ పరిపక్వతని బట్టబయలు చేస్తోంది. ఇక వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మాటలు చెప్పనే అక్కర్లేదు. లోకేశ్, బోండా ఉమా లాంటి వాళ్ళ ఒదురుబోతుతనానికి హద్దులే లేవు. విచిత్రమేంటంటే, జగన్ రాష్ట్రాన్ని ఉచిత పథకాలతో దివాళా తీయిస్తున్నాడని మాట్లాడే ప్రతిపక్ష నాయకులు, తమకి అధికారమిస్తే మరిన్ని ఎక్కువ డబ్బులిస్తామని ఓటర్లని మభ్య పెట్టాలనుకోడం వాళ్ళ బుర్రలేనితనాన్ని బయటపెడుతోంది.
అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోలేని దుస్థితి వీళ్లది. చంద్రబాబు హామీలు నీటిమూటలేనని మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రజలకి తెలుసు. ఆయన హామీలు ప్రకటించే తీరు కూడా ఏ మాత్రం సీరియస్‌గా అనిపించదు. వలంటీర్లకు నెలకి పది వేలిస్తాం అని అరుస్తూ చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారు. వలంటీర్ల వల్ల రాష్ట్రంలో ఆడపిల్లలు మాయమైపోతున్నారని పవన్ కళ్యాణ్, పురుషులు ఇంట్లో లేని సమయాల్లో వలంటీర్లు ఇళ్ళకి వెళుతున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు ఆ వ్యవస్థని ఎలాగైనా భ్రష్టు పట్టించాలని చేయని ప్రయత్నం లేదు. చివరికి, ఆ వ్యవస్థ జగన్‌కి మేలు చేసేస్తోందని భయపడి, తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి, పింఛను, రేషన్ పంపిణీకి వాళ్లను దూరం చేసి పైశాచికానందం పొందుతున్నారు. వయసుమీరిన లబ్ధిదారులు నానా అవస్థలు పడుతుంటే, కొందరు చచ్చిపోతుంటే .. మొసలి కన్నీరు కారుస్తూ అదేదో జగన్ తప్పిదం లాగా రంగు పులమాలని ఈ ఇద్దరూ చేసే ప్రయత్నం, వాళ్లకి తాన తందానా కొడుతున్న పచ్చ పత్రికలూ, పచ్చ ఛానెళ్ల బాధ్యతారాహిత్యం ప్రజల్లో ఇప్పటికే కావాల్సినంత ఏవగింపును కలగజేశాయని ఎందుకు గుర్తించారో?
నేను చేసిన మంచిని చూసి ఓట్లడగడానికి వచ్చాను.. మంచి జరిగిందనుకుంటేనే ఫ్యాను గుర్తుకి ఓటు వేయండని జగన్ బహింరంగంగా అన్ని మీటింగుల్లోనూ అభ్యర్థిస్తున్నాడు. వీళ్ళేమో .. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు అందించిన పాలనను మళ్ళీ తెస్తామని చెప్పుకునే ధైర్యం లేని దుస్థితిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకోకపోవచ్చు. పైగా కసిగా ఓట్లేసి ఈ నరం లేని నాలుకలు తెగ్గొయ్యచ్చు. ఇంకా 20 రోజుల కంటే సమయం లేదు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.