ఎన్నికల వేళ ఎడాపెడా హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేయడం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నీతి. చంద్రబాబు 2014 ఎన్నికల్లో 650 వరకు హామీలు ఇచ్చి వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్ పేరిట హామీలు వెదజల్లారు. 2014లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానంటే నమ్మేదెవరనేది ప్రశ్న.
2014 ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఏ ఒక్కరూ కూడా రుణ వాయిదాలు చెల్లించవద్దని చంద్రబాబు చెప్పారు. బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు చెల్లించొద్దని, తాను అధికారంలోకి రాగానే వాటిని విడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దాంతో చంద్రబాబు మాటలను నమ్మి చాలా మంది తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేదు. చివరకు రుణభారం ఇంతింతై అన్నట్లు పెరిగింది. దాంతో బ్మాంకుల నుంచి వారికి నోటీసులు వచ్చాయి. దాంతో అవమానాల పాలయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష మందికిపైగా రైతులు సహకార, వాణిజ్య బ్యాంకుల నుంచి ఏటా రూ.3,290 కోట్ల రుణాలు తీసుకుంటారు. చంద్రబాబు హామీని నమ్మి దాదాపు 1,10,336 సంఘాల్లోని 10,71,078 మంది మహిళలు తమ రూ.1,07107 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని ఆనందించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు.
తర్వాత 2019 ఎన్నికలు సమీపించడంతో మరోసారి మోసపు హామీలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడ్డారు. ఎన్నికలకు రెండు నెలల ముందు పసుపు – కుంకుమ పేర ప్రతి డ్వాక్రా మహిళకు మూడు విడతలుగా రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని కొంత మందికే పరిమితం చేశారు. రూ.2,500, రూ.3,500 మాత్రమే బ్యాంకుల్లో జమ చేశారు. మిగిలిన రూ.4 వేలకు చెక్కులు ఇచ్చి ఏప్రిల్ చివరిలో మార్చుకోవాలని సూచించారు. ఇంతలో నోటిఫికేషన్ వచ్చింది. ఆ చెక్కులు చెల్లుబాటు కాలేదు.
ఇంటికో ఉద్యోగం ఇస్తానని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కొద్ది మందికి నామ్‌కే వాస్తేగా రూ.1,000 చొప్పున వేసి చేతులు దులిపేసుకున్నారు. కాపులకు రిజర్వేషన్లు, ముస్లింలకు ప్రధాన నగరాల్లో హజ్ హౌస్ ల నిర్మాణం వంటి పలు హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు.
మోసాలకు మారు పేరుగా మారిన చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలు విశ్వసించడం లేదు. చంద్రబాబును నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.