ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో ఓ ప్రైవేట్ సంస్థకు గచ్చిబౌలిలో కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన వివాదంపై సుదీర్ఘకాలం తర్వాత తీర్పు వచ్చింది. 2004లో అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను హైకోర్టు తప్పుపట్టింది. ఆ కేటాయింపులను రద్దు చేస్తూ తర్వాత వచ్చిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
రూ.50 వేల కోట్ల స్కాం..
2003లో బిల్లీ రావు అనే వ్యక్తి హైదరాబాద్, చుట్టుపక్కల క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో IMG భారత్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉండగానే 850 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కారుచౌకగా ఎకరా రూ.50 వేలకే కేటాయించారు. ఆ టైంలో ఆ ప్రాంతంలో ఎకరా రూ.10 కోట్లు పలుకుతుందని సమాచారం.
అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోయి..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు హయాంలో జరిగిన భూ కేటాయింపులపై దృష్టి పెట్టిన వైఎస్సార్ ప్రభుత్వం…బిల్లీరావుకు 850 ఎకరాల భూమిని కేటాయిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో బిల్లీరావు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ అంశంపై సుదీర్ఘ విచారణ కొనసాగగా..తాజాగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ కూడిన తెలంగాణ హైకోర్టు బెంచ్ తీర్పునిచ్చింది. బిల్లీరావుకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్సార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. 850 ఎకరాలను తెలంగాణ సర్కార్‌కు అప్పజెప్పాలని స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ కుంభకోణం విలువ దాదాపు రూ.50 వేల కోట్లుగా చెప్పింది. ఎకరా రూ.10 కోట్లు విలువ చేసే భూమిని..కేవలం రూ.50 వేలకే చంద్రబాబు కట్టబెట్టారని ట్వీట్ చేసింది బీఆర్ఎస్. ఇక హైకోర్టు తీర్పుపై సామాన్యులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలోనూ ఇదే తరహా కుంభకోణాలకు చంద్రబాబు ప్లాన్ వేశారని ఆరోపిస్తున్నారు.