ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముప్పుతిప్పలు పడుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను వైఎస్ జగన్‌కు అంటగట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆయన కుట్రకు కోర్టు బ్రేక్ వేసింది. ప్రతి ప్రసంగంలోనూ ఆయన వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. చెల్లెమ్మలకు సమాధానం చెప్పలేని స్థితిలో జగన్ ఉన్నారని ఆయన అంటూ వచ్చారు. పీసీసీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలను, వివేకా కూతురు సునీతను అడ్డం పెట్టుకుని, వారు వివేకా హత్యపై గాలి వ్యాఖ్యలు చేస్తుంటే వాటిని చంద్రబాబు వాడుకుంటూ వచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా కూడా వారిద్దరి వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. కోర్టు ఆదేశాలతో వివేకా హత్యపై వారి నోళ్లు మూతలుపడ్డాయి.
చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు సోదిలో కూడా లేకుండా పోయాయి. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లనే కాకుండా వాటిని అందిస్తున్న తీరుపై కూడా ప్రజల్లో సానుకూలమైన అభిప్రాయం ఉంది. సంక్షేమ పథకాల ఫలితాలను లబ్ధిదారుల ఇంటి ముంగిటకు చేరుస్తున్న వలంటీర్ల వ్యవస్థపై తొలుత విషం కక్కిన చంద్రబాబు ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా వలంటీర్ల సేవలను ఆపించిన చంద్రబాబుకు పరిస్థితి ఎదురు తిరిగింది. వలంటీర్ల సేవలను తమకు దూరం చేసిన చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అది కలిసి వచ్చే అవకాశం చంద్రబాబుకు ఎంత మాత్రం లేదు.
బీజేపీతో పొత్తు తర్వాత ముస్లిం మైనారిటీలను ఆయన ఎంతగా బుజ్జగించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది. సీఎఎ, యుసీసీ, ముస్లిం రిజర్వేషన్ల కోటా వంటి ప్రధానమైన అంశాలపై ఆయన తన వైఖరిని స్పష్టం చేయలేకపోతున్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదన వంటి వాటి విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వస్తుంది కాబట్టి రాష్ట్రంలో కూటమిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు రాబట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. గతంలో తన ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి నిధులు ఎన్ని తెచ్చారు, వాటి ద్వారా ఎన్ని పథకాలను అమలు చేశారనే విషయాలను స్పష్టంగా చెప్పి ఆ హామీ ఇచ్చి ఉంటే నమ్మడానికి కాస్తా అవకాశం ఉండేదేమో. ఆ పని కూడా చంద్రబాబు చేయలేకపోతున్నారు. ఎందుకంటే, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత గుండు సున్నా చుట్టారు.
జగన్ పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని ఆయన అనిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నారు. అది తేలిపోయే ఆరోపణ మాత్రమే. చంద్రబాబు పాలనలో కన్నా జగన్ పాలనలో ఎక్కువ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఓడరేవుల నిర్మాణం జరుగుతోంది. ఐటీ కూడా గతంలో కన్నా ఎక్కువగా విస్తరించింది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా రాష్ట్రం చవిచూస్తోంది. అందువల్ల ఊకదంపుడు ఆరోపణలు, అసత్యాలతో కూడిన విమర్శలు చేయడం వల్ల ఫలితం ఉండే అవకాశం లేదు.
ఈ స్థితిలో కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా, లేదా అనే అనుమానాలు కూడా ఆయనను పీడిస్తున్నట్లు ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను, బీజేపీని ఆయన లెక్కకు మిక్కిలిగా ప్రశంసిస్తుండడమే దానికి సాక్ష్యం. రాష్ట్రంలో రామరాజ్యం స్థాపిస్తానని బీజేపీ నినాదాన్ని ఆయన అరువు తెచ్చుకున్నారు. రామరాజ్యం అంటే ఎలా ఉంటుందో, రాష్ట్రంలో రామరాజ్య స్థాపన వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటో చెప్పలేకపోతున్నారు. స్పష్టమైన, నిర్దిష్టమైన ప్రకటనలు మాత్రమే ప్రజల వద్దకు చేరుతాయనే విషయాన్ని ఆయన గ్రహించడం లేదు.
చంద్రబాబుకు తోడు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఊకదంపుడు వ్యాఖ్యలు మాత్రమే చేస్తున్నారు. ఏవేవో ప్రస్తావించి జగన్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. వారికి ఎల్లో మీడియా తోడైంది. ఈసారి చంద్రబాబు విజయం సాధించకపోతే తన భవిష్యత్తు కుక్కలు చింపిన విస్తరి అవుతుందని భావించిన రామోజీరావు కట్టుకథలు అల్లుతున్నారు. తద్వారా విషపుత్రికగా ఈనాడును మార్చేశారు.
ఎన్నికలకు ఇంకా ఎంతో గడువు లేదు. అయినప్పటికీ కూటమి పార్టీల మధ్య సమన్వయం కదురలేదు. సీట్ల సర్దుబాటుతో తలెత్తిన విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. వాటిని పరిష్కరించడం చంద్రబాబు చేత కావడం లేదు. చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారనే విషయం స్పష్టంగానే తెలిసిపోతోంది. ఈసారి విజయం సాధించకపోతే తన భవిష్యత్తు ఏమో గానీ తన ముద్దుల తనయుడు నారా లోకేష్ భవిష్యత్తు అంధకారబంధురమవుతుందనే భయం ఆయనలో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.