టీడీపీ మహిళా నాయకురాలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. అశ్లీల వీడియో వ్యవహారాన్ని పార్టీ నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన ఆదిమూలంపై చర్యలు తీసుకున్నారు. ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. నివేదిక వచ్చాక ఆదిమూలంతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించాలని టీడీపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు కోనేటి ఆదిమూలం. తనేంటో, తన పనితనం ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. కావాలని కొందరు సొంత పార్టీ(టీడీపీ) నేతలే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. ఆరోపణలు చేస్తున్న మహిళకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వైరల్ అవుతున్న వీడియో మార్ఫింగ్ చేసినట్లు కనపడుతోందని చెప్పారు.
ఆదిమూలం తనను చాలా రోజులుగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది. రూమ్‌లోకి వెళ్లగానే తనపై అత్యాచారం చేశాడని, సహకరించకపోతే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని సంచలన ఆరోపణలు చేసింది. ఆదిమూలం నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపింది. ఇలాంటి చీడ పురుగులు పార్టీలో ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని, ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మంగళగిరి పార్టీ ఆఫీసు ముందు పురుగుల మందు తాగి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది. దీంతో చంద్రబాబు ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.