ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జిరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తుందని, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వదని, జగన్ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను వాడుకుని బ్యాంకుల్లో తనఖా పెడుతాడని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పచ్చి అబద్ధాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు వియ్యంకుడు, నందమూరి బాలకృష్ణ ఇటీవల భూమిని రిజస్ట్రేషన్ చేయించుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లనే తీసుకున్నాడు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లనే తీసుకున్నాడు. ప్రజలను మాత్రం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారని భయపెడుతున్నారు. ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలులోకే రాలేదు. అటువంటి స్థితిలో ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరును ఎలా నియమిస్తారని ఎవరైనా అడుగుతారనే భయం కూడా ఆయనకు లేదు.
నిజానికి, ప్రజల ఆస్తులను కాపాడే గుణం చంద్రబాబుకు ఉందా అనేది ప్రధానమైన ప్రశ్న. అమరావతిలో వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు, ఆయన మనుషులు కాజేశారు. రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారు. ఎదురు తిరిగినవారిని చిత్రహింసలు పెట్టారు. విశాఖపట్నంలో లక్ష ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను చంద్రబాబు మాయం చేశాడు. అటువంటి వ్యక్తి ప్రజల భూములను సంరక్షిస్తాడా? సదావర్తి భూముల కుంభకోణాన్ని ఎవరైనా మరిచిపోతారా?
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 90 దేశాల్లో అమలులో ఉంది. మహారాష్ట్ర ల్యాండ్ టైటిలింగ్ మోడల్ యాక్ట్ ను చేసింది. 2019లో నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలు ఈ చట్టం చేసుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ మద్దతు తెలిపింది. ఈ చట్టాన్ని సాహసోపేతమైన చర్యగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశంసించారు.
ఎన్నికల సమయంలో ఆ చట్టంపై చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు ఎందుకు చెప్పుతున్నారు? ప్రజలను భయపెట్టి వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు దూరం చేయాలనేది ఆయన ఎత్తుగడ. తాను అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తానని ఆయన అంటున్నారు. బీజేపీని కాదని ఆయన అంత సాహసం చేయగలడా? అది ఆయన చేతుల్లో లేని విషయం.