రాబోయే ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబునాయుడు(chandrababu naidu) ఎంత డెస్పరేట్‌గా ఉన్నారనే విషయం అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అని, జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని ఎప్పుడో తేలిపోయిందని చంద్రబాబు చెబుతున్నదంతా ఉత్త కథలే అని అందరికీ తెలుసు. గెలుపుపై చంద్రబాబులో ఏ స్థాయిలో అనుమానాలు, భయముందనే విషయం తాజాగా బయటపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ రావును చంద్రబాబు ప్రకటించారు. గురజాలను గెలిపించేందుకు బద్ధశత్రువు అయిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు(ck babu)తో చంద్రబాబు సయోధ్య చేసుకున్నారు.
సీకే బాబుతో చంద్రబాబుకు ఏమాత్రం పడదు. గతంలో సీకే బాబు వ్యవహారాలపై టీడీపీ నేతలు పెద్దఎత్తున ఆందోళనలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. పాలిటిక్స్ లో సీకే యాక్టివ్‌గా ఉన్నంతకాలం ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, క్యాడర్‌తో చంద్రబాబు ఆందోళనలు చేయించారు. అలాంటిది ఇప్పుడు అదే సీకే బాబుతో చంద్రబాబు చేతులు కలపటాన్ని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. తన మద్దతుదారులతో సీకే చిత్తూరులో సమావేశం పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రావును గెలిపించాలని చెప్పారు.
గురజాలది బేస్ చిత్తూరే అయినా ఉండేది మాత్రం బెంగుళూరులో. బెంగుళూరు కేంద్రంగా వ్యాపారాలు చేసుకుంటూ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో చిత్తూరు నియోజకవర్గం పరిధిలో కొన్ని సామాజిక కార్యక్రమాలను చేస్తున్నారు. చిత్తూరు అసెంబ్లీ పరిధిలో మొదటి నుండి రెడ్లు, బలిజలు, ఎస్సీలు, బీసీలు, మొదలియార్లదే డామినేషన్. అయితే ఇప్పుడు చంద్రబాబు కమ్మ సామాజికవర్గానికి చెందిన జగన్మోహన్ రావును పోటీలోకి దింపారు. దీంతో ఏమైందంటే మొదటి నుండి పార్టీలో పనిచేస్తున్న వారంతా వ్యతిరేకమయ్యారు. అలాగే బలిజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. బలిజలకు, సీకే బాబుకు ఏమాత్రం పడదు.
సీకే బాబు టీడీపీ అభ్యర్థికి మద్దతుగా రంగంలోకి దిగటంతో అనివార్యంగా బలిజలు టీడీపీకి దూరమవుతున్నారు. మరి క్యాస్ట్ ఈక్వేషన్లు చంద్రబాబుకి తెలియకుండానే గురజాలకు టికెటిచ్చి బద్ధశత్రువు అయిన సీకే బాబుతో చేతులు కలిపారా అన్నదే ఎవరికీ అర్థంకావటంలేదు. గురజాల ఆర్థిక స్తోతమను చూసే చంద్రబాబు టికెటిచ్చారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే సమయంలో వైసీపీ జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చింది. దాంతో రెడ్లలో మెజారిటీ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలబడ్డారు. నాన్ కమ్మ సామాజికవర్గాల్లో మెజారిటీ వైసీపీకే మద్దతిస్తారని అనుకుంటున్నారు. రెడ్లు ఓట్లేయక, బలిజలు దూరమై, ఎస్సీ, మొదలియార్ల మద్దతులేక టీడీపీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూడాలి.