ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి మాత్రం న్యాయం జరిగేలా లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తొలి టీడీపీ ప్రభుత్వం కర్నూలుని పూర్తిగా లైట్ తీసుకుంది. ఇక న్యాయ రాజధానిగా కర్నూలుని ప్రకటించిన ఆ తర్వాతి ప్రభుత్వంలో కూడా అడుగులు ముందుకు పడలేదు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో మరోసారి కర్నూలు పేరు తెరపైకి వచ్చింది. ఈసారయినా రాయలసీమ పట్టణానికి మహర్దశ పడుతుందా అనే సందేహం ఉంది.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు సీఎం చంద్రబాబు. న్యాయశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపిస్తామన్నారు. ఈమేరకు మంత్రివర్గ భేటీలో తీర్మానం చేస్తామని, తర్వాత కేంద్రానికి పంపిస్తామని అన్నారు. అమరావతిలో అంతర్జాతీయ లా కాలేజీ ఏర్పాటుపై కూడా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టు ద్వారా 100 ఎకరాల్లో న్యాయకళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
లా నేస్తం..
వైసీపీ హయాంలో లా నేస్తం పథకం అమలైంది. జూనియర్ లాయర్లకు స్కాలర్ షిప్ లు అందించారు అప్పటి సీఎం జగన్. కూటమి వచ్చాక లా నేస్తం ఆగిపోయింది. అయితే దాన్ని తిరిగి పునరుద్ధరించే విషయంలో సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ లాయర్లకు, నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. జూనియర్ లాయర్లకోసం శిక్షణ అకాడమీ ఏర్పాటుకోసం కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.