పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష ఎమ్మెల్యేలలో ఒకరికి ఇవ్వడం ఆనవాయితీ. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆ పదవిని అరికెపూడి గాంధీకి ఇచ్చింది. ఆయన బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే కావడంతో ఆయనకు ఆ పదవి ఇచ్చారని అధికార కాంగ్రెస్ లాజిక్ చెప్పొచ్చు. కానీ కండువా మార్చిన అరికెపూడికి ఆ పదవి ఇవ్వడం దారుణం అంటూ బీఆర్ఎస్ రచ్చ చేస్తోంది. బీఆర్ఎస్ తరపున గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన అరికెపూడికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చి మరోసారి రాజకీయ కలకలం సృష్టించారు సీఎం రేవంత్ రెడ్డి.
మూడు కీలక కమిటీలను ఏర్పాటు చేస్తూ శాసనసభ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్.పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా కె.శంకరయ్య ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. పీఏసీ చైర్మన్ విషయంలో మాత్రం బీఆర్ఎస్ రగిలిపోతోంది. పార్టీ మారిన వారికి ఆ పదవి ఇవ్వడం దుర్మార్గం అంటూ ట్వీట్లు వేస్తున్నారు నేతలు. ఈ పదవి విషయంలో ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ ని రెచ్చగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
https://x.com/KTRBRS/status/1833144501747012064
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై.. హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ప్రభుత్వం వారిలో ఒకరికి కీలక పదవి ఇవ్వడం మరింత చర్చనీయాంశమవుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. అనర్హత వేటు వేస్తే వారంతా మాజీలవుతారు, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం. ఆ విషయం తెలిసి కూడా అరికెపూడి గాంధీకి కీలక పదవి ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం అర్థం చేసుకోవచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజీ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.