కొంతమంది దుర్మార్గులు చెరువులను ఆక్రమించడం వల్లే వరదలు వస్తున్నాయని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న ఆయన చెరువులు, నాళాల కబ్జాల గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నీటి వనరులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినవారు స్వచ్ఛంధంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని హితవు పలికారు. లేకపోతే హైడ్రా వాటిని మొత్తం నేలమట్టం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఆక్రమణదారులు ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు రేవంత్ రెడ్డి.
https://x.com/revanth_anumula/status/1833723634705191001
చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసే స్కీమ్ ఏదీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తప్పు చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకునే అవకాశం లేదని, సరిదిద్దుకోవాలంటే వాటిని ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందేనన్నారు. ఫాంహౌస్ లు కట్టుకుని డ్రైనేజీ నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లలో కలుపుతున్నారని మండిపడ్డారు. ప్రజలు తాగే మంచి నీటిని కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఎస్సైల పాసింగ్ అవుట్ కార్యక్రమంలో రూ.11.06 కోట్ల చెక్కుని సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ అందజేశారు. పోలీసు జాబ్ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది ఒక భావోద్వేగం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులదే కీలక బాధ్యత అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చిందని, మరో 35వేలకుపైగా ఉద్యోగాలు ఈ ఏడాది చివరికల్లా భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.