మహిళా వలంటీర్లను నిర్బంధించి, తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన జనసేన అభ్యర్థిపై ఏకంగా క్రిమినల్ కేసు నమోదయింది. వైసీపీ తరఫున ప్రచారానికే ఓ చోట చేరారంటూ పలువురు వలంటీర్లను కాకినాడ రూరల్‌లో కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంతం నానాజీ ఆయన అనుచరులు నిర్బంధించారు. ఇందులో ఓ వలంటీరు గర్భిణి అని చెప్పినా వినకుండా తలుపులు తాళం వేసేసిన ఘటన రెండు రోజుల కిందట కాకినాడలో జరిగింది.
స్పృహ తప్పి పడిపోయిన వలంటీరు
ఓ వలంటీరు పుట్టినరోజు వేడుకలకు సహచర వలంటీర్లంతా కలిశారు. వారంతా వైసీపీ అభ్యర్థి ప్రచారం కోసమే వచ్చారంటూ జనసేన అభ్యర్థి పంతం నానాజీ, ఆయన అనుచరులు వచ్చి వారిపై కేకలేసి, గదిలో పెట్టి తాళం వేశారు. ఇందులో చాలామంది మహిళా వలంటీర్లే. అందులోనూ ఒకరు గర్భిణి ఉన్నారని చెప్పినా వినిపించుకోలేదు. వలంటీర్లు పోలీసులకు ఫోన్ చేసి వారు వచ్చి విడిపించేసరికి ఆ గర్భిణి అయిన వలంటీరు స్పృహ తప్పి పడిపోయారు. మిగిలిన మహిళా వలంటీర్లు భయపడిపోయారు.
తమను అక్రమంగా నిర్బంధించారంటూ వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చర్యలకు పూనుకున్నారు. కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీతోపాటు ఆయన అనుచరులు పలువురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్రమంగా నిర్బంధించడం, భయభ్రాంతులకు గురిచేయడం సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టారు.