వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. ఎక్కడ చూసినా మోకాళ్లలోతు వరద నీరే కనిపిస్తోంది. వరదల ప్రభావం దాదాపు లక్ష మందిపై పడినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లోనే చంద్రబాబు ఉన్నారు. స్వయంగా వరద బాధితులకు ఫుడ్ ప్యాకెట్స్ అందించారు. అధికారుల వెంట ఉంటూ వారికి సూచనలు చేస్తున్నారు. అటు లోకేష్ సైతం మంగళగిరిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు ధైర్యం కల్పించారు.
కానీ, ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ ఆచూకీ మాత్రం కనిపించడం లేదు. ఏపీ రాజధాని ప్రాంతం వరదల్లో చిక్కుకుంటే డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్ ఇప్పటివరకూ కనిపించకపోవడం గమనార్హం. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన నాయకుడు కేవలం సోషల్‌మీడియాలో ప్రకటనలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వరద బాధితులకు కార్యకర్తలు అండగా ఉండాలంటూ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. చివరగా వనమహోత్సవం కార్యక్రమంలో కనిపించారు పవన్‌కల్యాణ్.
వరదల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. విజయవాడలో వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. కానీ, జనసేన పార్టీ పెద్దల నుంచి బాధితులకు పరామర్శ కూడా కరువైంది. ఎన్నికలకు ముందు ప్రచారంలో జగన్ సర్కార్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్‌కల్యాణ్.. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ యువతను రెచ్చగొట్టేలా స్పీచ్‌లు ఇచ్చేవారు. కానీ, అధికారంలోకి వచ్చాక పవన్‌కల్యాణ్ ప్రజలకు దూరంగా ఉంటున్నారన్న విమర్శ మొదలైంది. నియోజకవర్గంలో బాధ్యతలు టీడీపీ ఇన్‌ఛార్జి వర్మకు అప్పగించేశారు. రివ్యూ మీటింగ్‌లు, అధికారిక కార్యక్రమాలు మినహా ప్రజల్లో పవన్ కనిపించడం లేదు.