ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ స్వయంగా వరద బాధితుడిగా మిగిలిపోయారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలోని ఆయన ఇంటి స్థలాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో ఆ స్థలం ఇప్పుడు చెరువును తలపిస్తోంది. పవన్ ఇంటి స్థలం పక్కనే ఉన్న ఏలూరు కాలువ ఉప్పొంగడంతో పవన్ ఇంటి స్థలంతో పాటు దాని పరిసరాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. కాకినాడ ఏలేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో ఏలూరు కాలువకు వరద పోటెత్తింది. కాలువ గట్లు తెగిపోయి మొత్తం 8 మండలాలు ముంపు బారిన పడ్డాయి.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిఠాపురంలో సొంత ఇల్లు నిర్మించుకుంటానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు పవన్. ఇందులో భాగంగా పిఠాపురం – గొల్లప్రోలు టోల్‌ప్లాజా పక్కనే 3.52 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిని దాదాపు రూ. 50 లక్షల 5 వేలకు కొనుగోలు చేశారు పవన్. జూలై 3వ తేదీన పవన్ పేరిట ఈ భూమి రిజిస్ట్రేషన్ అయింది.
ఇటీవల కృష్ణా నదికి వచ్చిన వరదల కారణంగా సీఎం చంద్రబాబు నివాసం నీట మునిగిన విషయం తెలిసిందే. కరకట్ట పరిధిలో నిర్మించిన ఈ బిల్డింగ్‌లో దాదాపు ఫస్ట్ ఫ్లోర్ దాటి వరద నీరు వచ్చింది. దీంతో విలువైన వస్తువులన్నీ పాడైపోయినట్లు సమాచారం. ఐతే ఈ విషయాలను బయటకు రానివ్వలేదు. తర్వాత సీఎం చంద్రబాబు స్వయంగా తన ఇల్లు కూడా వరదల్లో మునిగిపోయిందని చెప్పారు.