నేను సంపద సృష్టిస్తా.. ఇంటికో ఉద్యోగం ఇస్తా.. నా అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా.. ఎన్నికల ముందు చంద్రబాబు మాట్లాడిన మాటలివి. తన అనుభవంతో సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారి తీసింది. ఇదేమి విడ్డూరం అంటూ భక్తజనం కూటమి ప్రభుత్వంపై మండిపడుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం. ఇక్కడ తిరుపతి వెంకన్నను దర్శించుకునే వారి సంఖ్య రోజుకు లక్ష తగ్గదంటే మాటలు కాదు. వచ్చినవారు స్వామివారికి మొక్కులు తీర్చుకొని కానుకలు సమర్పిస్తుంటారు. అలా వచ్చిన నిధులను బోర్డు సభ్యుల నిర్ణయాల ప్రకారం కేవలం ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడుతుంటారు.
కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలపై భక్త జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిధులతో చంద్రగిరి నియోజక వర్గంలో రహదారుల నిర్మాణం కోసం ఈవోకు ఆదేశాలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2021నవంబర్లో జవాద్ తుపాన్ వల్ల స్వర్ణముఖి నదిపై దెబ్బతిన్న కాజ్ వే నిర్మాణాలకు నిధులు కేటాయించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రబాబును కోరారు.
స్పందించిన సీఎం చంద్రబాబు.. స్వర్ణముఖి నదిపై కాజ్ వే నిర్మాణం, తనపల్లి రోడ్ తాజ్ హోటల్ సమీపంలో కాజ్ వే నిర్మాణం, తిరుపతి పూడి మార్గం తిరుచానూరు వద్ద కాజ్ వే నిర్మాణం, ఐతేపల్లి రంగం పేట రోడ్ ఐతేపల్లి వద్ద కాజ్ వే నిర్మాణానికి టీటీడీ నిధులుతో నిర్మాణం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సీఎం సెక్రటరీ ప్రద్యుమ్న కూడా ఆదేశాలు జారీ చేశారు. కాగా, టీటీడీ నిధులతో చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కేటాయించడంపై ప్రజలు, టీటీడీ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించే అవకాశం ఉందని, అయినా సంపద సృష్టికర్తకు శ్రీవారి నిధులెందుకని ప్రశ్నిస్తున్నాయి.