ఏపీలో వరద రాజకీయాల్లో భాగంగా కొత్తగా పడవ రాజకీయాలు మొదలయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ కి అడ్డుగా కృష్ణా నదిలో వైసీపీ నేతలు, వారి అనుచరులు పడవల్ని వదిలారని, బ్యారేజ్ గేట్లు ధ్వంసం చేయాలని చూశారని టీడీపీ ఆరోపిస్తోంది. పోలీసులు కూడా ప్రాథమిక విచారణలో కుట్రకోణం ఉందని తేల్చడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే వరద సహాయక చర్యల్లో విఫలం అయిన ప్రభుత్వం పడవలను తెరపైకి తెచ్చి డైవర్షన్ గేమ్ మొదలు పెట్టిందని అంటున్నారు వైసీపీ నేతలు. మాజీ మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వరద సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ. చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్ అని, ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని ధ్వజమ్తెతారు. విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని చెప్పారు. చంద్రబాబుకి పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను రక్షించడంపై లేదని, బుడమేరు కాల్వ నుంచి వరద వస్తుందని తెలిసి కూడా డీఈ హెచ్చరికలను ప్రభుత్వం లెక్క చేయలేదని ఆరోపించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వరదలపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు గుడివాడ.
https://www.youtube.com/live/vd0mG3s1ado?si=TgxbaMDTX6RQxo2c
విజయవాడ వరద మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గుడివాడ. గతంలో అల్లూరి జిల్లాలో వరదలొస్తే 250 గ్రామాల ప్రజలను సురక్షితంగా రక్షించామమని గుర్తు చేశారాయన. ఇప్పుడు విజయవాడ విలయాన్ని ప్రభుత్వం నియంత్రించలేకపోయిందన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవలను వదిలేశారంటూ వైసీపీపై బురదజల్లుతున్నారని, అధికారంలో ఉన్నది వారే కాబట్టి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు గుడివాడ.
వరద నివారణ చర్యలతో పాటు సహాయక కార్యక్రమాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు మరో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు జగన్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. 1964 లో బుడమేరకు భారీ వరద వస్తే కేవలం 10మందే చనిపోయారని.. రియల్ టైమ్ గవర్నెన్స్ గురించి చెప్పే చంద్రబాబు.. వరద తీవ్రతను ఎందుకు గుర్తించలేకపోయారని నిలదీశారు కాకాణి. చంద్రబాబు కూడా ముంపు బాధితుడే కాబట్టి తన నివాసం వదిలి పునరావస కేంద్రమైన కలెక్టరేట్ లో తలదాచుకున్నారని ఎద్దేవా చేశారు. మోకాలు లోతు వరద నీటిలో దిగి జగన్ పరామర్శలు ప్రారంభించిన తర్వాత చంద్రబాబు నీళ్లలోకి దిగారని గుర్తు చేశారు. తమ హయాంలో తీసుకొచ్చిన రేషన్ వాహనాలను ఇప్పుడు వరదల సమయంలో కూటమి ప్రభుత్వం వాడుతోందని చెప్పారు కాకాణి.
https://www.youtube.com/live/-CLCRfKFISE?si=_kDWn0V2S9VAUBFF
ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఇందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీ పడవల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. బ్యారేజ్ ని ఢీకొట్టిన పడవలు వైసీపీ నేతలకు చెందినవని అంటున్నారని ఇది డైవర్షన్ గేమ్ అని విమర్శించారు. చంద్రబాబు అక్రమ కేసులో అరెస్ట్ అయి ఏడాది అయిందంటూ ఆ పార్టీ అనుకూల మీడియా కథనాలిస్తోందని.. ఆ కేసుని అక్రమ కేసు అనడం సరికాదన్నారు కాకాణి. కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే చంద్రబాబుని నిర్దోషిగా తీర్మానించేస్తారా అని మండిపడ్డారాయన.