ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిక్కులను ఎదుర్కుంటున్నారు. టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి డిజిటిల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.
దాంతో టీడీపీకి చెందిన అన్ని విభాగాల అధినేతగా ఉన్న చంద్రబాబుకు నోటీసులు అందాయి. వైసీపీ నాయకులు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. వచ్చే 24 గంటల్లోగా వైఎస్ జగన్‌పై పెట్టిన అభ్యంతరకరమైన పోస్టులన్నింటినీ తొలగించాలని ఆదేశించారు.
సోషల్ మీడియాలో ఆ విధమైన పోస్టులు పెట్టడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. జగన్‌పై పెట్టిన పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ ముఖేష్ కుమార్ మీనాకు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన మీనా చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు.