కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాల కేసు దాదాపు క్లోజ్ అయిందనే చెప్పాలి. ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా సీక్రెట్ కెమెరాలు లేవు అని స్పష్టం చేశారు. పోలీస్ విచారణలో కూడా ఇదే తేలిందన్నారు. ఈ నేపథ్యంలో ఐజీ కూడా సీక్రెట్ కెమెరాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. కాలేజీ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు లేవని, దానిపై వచ్చిన వార్తలన్నీ వట్టి పుకార్లేననని అన్నారు. సాక్ష్యాలతో ఎవరైనా ముందుకొస్తే దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై కూడా విచారణ జరుపుతున్నామని, ఉద్దేశపూర్వకంగా పుకార్లు వ్యాప్తి చేసిన వారిపై, విద్యార్థుల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ బాత్రూమ్ లలో కెమెరాలు ఉన్నాయని, 300 వీడియోలు బయటకు వెళ్లాయనే వార్తలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హాస్టల్ యాజమాన్యం సరిగా స్పందించకపోవడంతో విద్యార్థినులు నిరసనకు దిగారు. కెమెరాలు లేవని తొలిరోజే పోలీసులు తీర్మానించారు. ఈరోజు కూడా అదే చెబుతున్నారు. ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించడంతో మరోసారి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీకి చెందిన కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(CERT), పుణెకు చెందిన సి-డాక్ సంస్థ నిపుణులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ విద్యార్థి, మరో విద్యార్థిని ఫోన్లు, ల్యాప్ టాప్ లు అన్నీ తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు లేవు, వీడియోలు కూడా దొరకలేదని తేల్చారు. అయితే అప్పటికే ఏవైనా వీడియోలు డిలీట్ చేశారా అనే అనుమానంతో ఫోన్లు, ల్యాప్ టాప్ లను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తున్నారు. ఆ వివరాలు 5 రోజుల్లో వస్తాయన్నారు.
కెమెరాలు లేవంటున్నారు సరే, అసలీ పుకార్లు ఎందుకొచ్చాయి, విద్యార్థినుల ఆందోళనకు కారణం ఏంటనేది తేలాల్సి ఉంది. నలుగురు స్టూడెంట్స్ దీనికి కారణం అంటూ ఆమధ్య మంత్రి నారా లోకేష్ కూడా ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. వారు ఏం చేశారు..? వీడియోల పేరు చెప్పి మిగతావారిని ఎందుకు ఇబ్బంది పెట్టారు..? హడావిడిగా వారిని హాస్టల్ నుంచి ఎందుకు తరలించాల్సి వచ్చింది..? వారిపై తీసుకుంటున్న చర్యలేంటి..? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికయితే విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని చెబుతున్నారు పోలీసులు. దీంతో ఈ వివాదానికి వారు ముగింపు పలికారనే చెప్పాలి.