పెళ్లి బాజాలు మోగి వారం తిరక్కుండానే ఆ ఇంట్లో మరణ మృదంగం మోగింది. కుమారుడి పెళ్లి చేసి, సకుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి వస్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు హైదరాబాద్ వాసులు దుర్మరణం పాలయ్యరు.
శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా దారుణం
సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ తన కుమారుడు బాలకిరణ్‌కు గత నెల 29న గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం చేశారు. ఈ నెల 3న శామీర్‌పేటలో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించారు. 4న కొత్త జంటను తీసుకుని కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తిరిగివస్తుండగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల హైవేపై లారీని వీరి కారు ఢీకొట్టింది.
కొత్త జంటతో సహా కుటుంబమంతా బలి
ఈ ప్రమాదంలో కారు బలంగా లారీని ఢీకొట్టడంతో రవీందర్, ఆయన భార్య లక్ష్మి, పెళ్లి కుమారుడు బాలకిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్‌కిరణ్ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే చనిపోయారు.