ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. దీంతో కరకట్ట మీదుగా వరద ప్రవహిస్తోంది. కరకట్ట లోపల నిర్మించిన భవనాలన్నింటిని నీరు ముంచెత్తింది. మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి చికిత్సాలయం ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు చేరడంతో అందులో ఉన్న 400 మందిని రెస్క్యూ సిబ్బంది, పోలీసులు తాళ్ల సాయంతో రక్షించారు.
ఐతే కరకట్ట లోపల నదిని ఆనుకుని నిర్మించిన సీఎం చంద్రబాబు నివాసాన్ని సైతం వరద నీరు ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు అధికారులు బయటకు రానివ్వట్లేదు. అంతకుముందు వరద నీరు చంద్రబాబు నివాసంలోకి రాకుండా ఇసుక బస్తాలు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు. లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తెప్పించిన విజువల్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు వరద ఉధృతి అంతకంతకూ పెరగడంతో చంద్రబాబు నివాసంలోని ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. విలువైన వివిధ వస్తువులను బయటకు తీసుకువచ్చారని తెలుస్తోంది. ఇక అటువైపుగా అధికారులు ఎవరినీ అనుమతించట్లేదు. బారికేడ్లు పెట్టి సెక్యూరిటీ టైట్ చేశారు.
వరద ఉధృతి పెరుగుతుందన్న సమాచారంతోనే రాత్రి ఉండవల్లి కరకట్ట నివాసంలో చంద్రబాబు బసకు అధికారులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. అధికారుల సూచనలతోనే ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో బస చేశారని సమాచారం. 2019లో వరదలు వచ్చిన టైంలోనూ చంద్రబాబు నివాసం మునిగింది. ఐతే అప్పుడు వైసీపీపై ఆరోపణలు చేశారు చంద్రబాబు. ఉద్దేశపూర్వకంగానే తన నివాసం వరదల్లో మునిగేటట్లు చేశారని ఆరోపించారు. ఇప్పుడు తన నివాసం మునిగిపోయిందని వార్తలు వస్తే ప్రతిపక్షం నుంచి విమర్శలు తప్పవని తెలిసి, అందుకు సంబంధించిన వివరాలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.