కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు కలిసి సామాన్యుడి జేబులను కొల్లగొడుతున్నట్టు కనబడుతోందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం లేదని ఆయన పేర్కొన్నారు.
గడచిన ఆరు నెలల కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 21 శాతం మేర తగ్గాయని ఆయన గుర్తుచేశారు. కానీ.. కేంద్రం మాత్రం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదని ఆయన తెలిపారు. ఇదంతా చూస్తే.. తన అనుమానం నిజమేననిపిస్తోందన్నారు. తగ్గిన ముడిచమురు ధరల ప్రకారం.. పెట్రోల్‌పై లీటరుకు రూ.10, డీజిల్‌పై రూ.8 వరకు తగ్గించవచ్చని ఆయన తెలిపారు.
ఇంధన ధరల తగ్గింపు విషయంలో రాజస్థాన్ ప్రజలను బీజేపీ రెట్టింపు మోసం చేసిందని గెహ్లాట్ మండిపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే పెట్రోల్, డీజిల్ ధరలను హరియాణా, గుజరాత్‌లతో సమానంగా ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, ఆ హామీ ఇప్పటివరకు అమలు కాలేదని ఆయన తెలిపారు. ఈ హామీని ఎప్పటికి నెరవేరుస్తారో రాజస్థాన్ ప్రజలు తెలుసుకోవాలనుకొంటున్నారని ఆయన పేర్కొన్నారు.