గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ వాష్‌రూమ్స్‌లో హిడెన్ కెమెరాల ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి అన్నారు. చంద్రబాబూ ఇకనైనా మేలుకోండి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తు పణంగా పెట్టకండి అంటూ ట్విట్టర్ వేదికగా కూటమి ప్రభుత్వానికి చురకలు అంటించారు.
చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు వైఎస్ జగన్. ప్రతిపక్షపార్టీపై బురదజల్లే వ్యవహారాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారని జగన్ ఆరోపించారు.
గుడ్లవల్లేరు ఘటనను వైసీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. హిడెన్ కెమెరాల అమర్చిన విద్యార్థి విజయ్ జనసేన పార్టీ అభిమాని అని, అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో జనసేన, పవన్ కల్యాణ్ పోస్టులు ఉన్నట్లు బయటపెట్టింది. అదే విధంగా ఇంజినీరింగ్ కాలేజీ టీడీపీ సానుభూతిపరుడిది కావడంతో కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.