పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలోకి జారి పడిపోయింది. గురువారం జరిగిన ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని జులుక్ వైపు వెళుతుండగా వెర్టికల్ వీర్ అనే ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది. జవాన్ల వాహనం అదుపు తప్పడంతో 700 అడుగుల లోతైన లోయలోకి జారిపడింది.
జవాన్ల వాహనం సిల్క్ రూట్‌గా ప్రసిద్ధి చెందిన రెనోక్ రోంగ్లీ హైవే వెంబడి వెళుతుండగా దలోపంద్ దారా వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతిచెందినవారు.. డ్రైవర్ ప్రదీప్ పటేల్ (మధ్యప్రదేశ్), క్రాఫ్ట్‌మేన్ డబ్ల్యూ పీటర్ (మణిపుర్) నాయక్ గురుసేవ్ సింగ్ (హరియాణా), సుబేదార్ కె. తంగపాండి (తమిళనాడు)గా గుర్తించారు. వీరంతా బెంగాల్‌లోని బినాగురి యూనిట్‌కి చెందిన సైనిక సిబ్బంది అని తెలిసింది.