జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు సలహాలు ఇస్తూ లేఖలు రాస్తున్న మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యనూ ఎల్లో మీడియా వదలడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జోగయ్య కోవర్టుగా పనిచేస్తున్నారని ప్రచారం చేస్తోంది. దీనిపై హరిరామ జోగయ్య తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌కు ఆయన మరో లేఖ రాశారు.
మొన్న జరిగిన బహిరంగ సభలో తనకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని పరోక్షంగా పవన్ కల్యాణ్ తనను ఉద్దేశించి అన్నట్లు అర్థమైందని, తాను జగన్‌కు కోవర్టుగా పనిచేస్తున్నాననే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టులో తాను కేసు వేశానని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని తాను టీడీపీ, జనసేన కూటమికి సలహాలు ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
తనకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవని, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తాను పదవిని వదిలేసుకుని పవన్ అన్న చిరంజీవి వెంట నడిచానని చెప్పారు. చంద్రబాబు జిత్తులమారి తెలివితేట నుంచి మిమ్మల్ని రక్షించేందుకే జనసైనికుల తరఫున తాను లేఖలు రాస్తున్నట్లు ఆయన పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. మీ హోదాకు తగినట్లు పొత్తులో భాగంగా మీకు సముచిత స్థానం కల్పించాలనేది తన కోరిక అంటూ ఆయన లేఖలో రాసుకొచ్చారు.
మీకు, నాకు మధ్య దూరం పెంచడానికి చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మీకు తక్కువ సీట్లు ఇచ్చి లోకేష్‌ను సీఎం చేయడానికి నిదానంగా మిమ్మల్ని దూరం చేస్తున్నారనే అనుమానం జనసైనికుల్లో ఉందని, మీరు రెండున్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలనేది తన అభిమతమని జోగయ్య చెప్పారు. మీ మీద ప్యాకేజీ స్టార్ అని ముద్ర వేస్తుంటే చంద్రబాబు గానీ లోకేష్ గానీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. తాను ఇక ముందు కూడా లేఖలు రాస్తూనే ఉంటానని ఆయన చెప్పారు.