తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత పోలీస్ శాఖ పనితీరు పూర్తిగా రివర్స్ అయిందనేది బీఆర్ఎస్ ఆరోపణ. తమ హయాంలో శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయని, కాంగ్రెస్ రాగానే గాడి తప్పాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో నేరుగా పోలీసులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలను పోలీస్ శాఖ కూడా నిశితంగా గమనిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం నేతలు. దురుద్దేశంతో ఇలాంటి విమర్శలు చేయడం సరికాదన్నారు.
తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉండి, తెలంగాణ పోలీసుల పనితీరు తెలిసి కూడా హరీష్ రావు ఇలా విమర్శలు చేయడం విస్మయాన్ని కలిగించిందని అన్నారు తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం నేతలు. తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలోనే సమర్థవంతమైన విభాగంగా పేరుందని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం మధ్యలో పోలీసులను ఇరుకున పెట్టాలని చూడటం సరికాదన్నారు. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం మంచిది కాదని హితవు పలికారు. హరీష్ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం ఓ లేఖ విడుదల చేసింది.
గతంలో కూడా తెలంగాణ పోలీసులపై హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, మహిళలపై లైంగిక దాడులు పెరిగాయని అన్నారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 1900 అత్యాచారాలు, 2600 హత్యలు జరిగాయని విమర్శించారు. 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేశారని, బీహార్ నాటు తుపాకులు తెలంగాణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు హరీష్ రావు. మహిళలకు భద్రత కరువైందని, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలన్నారు. గతంలో తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ హరీష్ రావు చేసిన విమర్శలకు వెంటనే బదులిచ్చారు అధికారులు. తెలంగాణలో శాంతిభద్రతలు కాపాడటం కోసం పోలీస్ శాఖ అత్యంత నిబద్ధతతో పనిచేస్తుందని, నిందితులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవటానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకాడబోమమని వారు అన్నారు. తాజాగా పోలీస్ అధికారుల సంఘం హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. పోలీసుల మనో ధైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం పద్ధతి కాదన్నది.